
వృద్ధులను గౌరవించాలి
భూపాలపల్లి అర్బన్: వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలి పారు. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వృద్ధాశ్రమంలో న్యాయ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. సమస్యలు ఎదుర్కొంటున్న వయోవృద్ధులు ఎవరైనా సరే న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే వారికి చట్టబద్ధంగా ఉచిత సహాయం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల చట్టం, న్యాయసేవాధికార సంస్థ అమలుపరుస్తున్న వివిధ పథకాలను వారికి వివరించారు. వృద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న పెద్దవారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్‌కుమార్, బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, అమృతవర్షిణి, అక్షర స్వచ్చంధ సేవా సంస్థ నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ, ప్రియాంక పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు