
‘పనుల జాతర’కు ఏర్పాట్లు చేయాలి
● మట్టి వినాయక విగ్రహాలను
ప్రతిష్ఠించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు చేపట్టిన పనుల జాతర–2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి నేడు (శుక్రవారం) నిర్వహించనున్న ‘పనుల జాతర–2025’ కార్యక్రమంపై గురువారం ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీపీఓలు, పీఆర్ ఇంజనీర్లు, ఏపీఓలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ. 3.93 కోట్ల వ్యయంతో 1,075 పనులు చేపట్టనున్నామని, అధికారులు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి..
జిల్లాలో పీఎం ఆవాస్ యోజన సర్వే పనులను ఈ నెలాఖరులోపు పూర్తిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చే యాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం నుంచి గృహ నిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 55,444 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 3,359 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.
మట్టి వినాయక విగ్రహాలు
ఏర్పాటు చేసుకోవాలి..
వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున రెండు వేల మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి క్రాంతికిరణ్, కలెక్టరేట్ సీ విభాగం పర్యవేక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.