
చేపపిల్లల జాడేది!
జిల్లాలో చెరువుల వివరాలు..
చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా..
భూపాలపల్లి రూరల్: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేపలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీపై అలసత్వం వహిస్తోంది. ప్రతీ సంవత్సరం మే నెలలో అధికారులు ప్రతిపాదనలు పంపి, జూన్, జూలై నెలలో టెండర్లు పూర్తి చేస్తారు. ఆగస్టు నెల వరకు చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉంటాయి కాబట్టి చేప పిల్లలను వదులుతారు. కానీ ఈ ఏడాది ఆగస్టు మాసం చివరికి వచ్చినప్పటికీ టెండర్లు పూర్తి కాలేదు. దీంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా! అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
837కి పైగా చెరువులు, కుంటలు
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేపపిల్ల ల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. వానాకాలం భారీ వర్షాలు కురిస్తే ఆగస్టు నెల నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ జరగాల్సి ఉంది. కానీ ఆగస్టు 31వ తేదీ వరకు టెండర్లకు గడువు ఉంది. సెప్టెంబర్‌లో చేప పిల్లలను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఆ నెలలో పంపిణీ చేస్తే చేపపిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు మొత్తం 837 ఉన్నాయి. వీటిలో చేపపిల్లలు పోయాలంటే జిల్లాకు 2.30 కోట్ల చేపపిల్లలు అవసరం ఉంటుంది.
పంపిణీలో అక్రమాలు!
గతంలో మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్ల ల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్లే లాభపడుతున్నారని, మత్స్యకారులకు ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. చెరువుల్లో చేపపిల్లలు పోయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను తేకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా చేపపిల్లల లెక్కింపులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని మత్స్యకారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి నాణ్యమైన చేప పిల్లలను త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మొత్తం చెరువులు 833
రిజర్వాయర్లు 05
మత్స్యకార సహకార సంఘాలు 125
సహకార సంఘాల సభ్యులు 10679
జిల్లాలో 837 చెరువుల్లో 2.30 కోట్ల చేపపిల్లలు అవసరం
ఇప్పటికీ పూర్తికాని టెండర్లు
అయోమయంలో మత్స్యకారులు