జిల్లాలో ఇప్పటి వరకు 74,802 మంది ఓటర్లు లెక్కతేలని వారున్నారు. 40,944 మంది మ్యాపింగ్ కాని వారున్నారు. వీరికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 2002లో ఉన్నట్లు ఏదో ఒక ప్రూఫ్ చూపిస్తే వారి ఓట్లు అలాగే ఉంటాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సగటున 50 నుంచి 100 మంది వరకు ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉన్నందున రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు తొలగింపునకు గురవుతున్న ప్రతీ పేరును పరిశీలించి సంబంధిత రికార్డులపై సంతకాలు చేయాలని అధికారులు సూచించారు. కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మ్యాపింగ్ కాని వారు 12 రకాల ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే మళ్లీ వారికి ఓటరు జాబితాలో అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పారదర్శకంగా, కచ్చితమైన ఓటరు జాబితా తయారీకి సహకరించాలని కోరగా, ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించారు. ముసాయిదా ఓటరు జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు.
డిజిటలైజేషన్‌తో బిజీబిజీ
సర్ ప్రక్రియలో తమ ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేశారు. చివరి రోజున కూడా బీఎల్‌వోలకు పెద్ద సంఖ్యలో ఫారాలు అందాయి. ఒకవైపు ఫారాల సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్‌వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం దగ్గరపడడంతో చివరి రోజు రాత్రి వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించారు.
జూన్ 25 నుంచి..
రాష్ట్రంలో సర్ ప్రక్రియను తొలుత జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి ఆగస్టు 10 వరకు గడువు పెంచింది. మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్ ప్రక్రియ సోమవారం ముగిసింది.
జగిత్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. జిల్లాలో ఇప్పటి వరకు 89.63 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. గత నెల 24న ముగియాల్సి ఉండగా, ఓటర్ల నుంచి స్పందన రాకపోవడంతో మళ్లీ గడువు పెంచారు. జిల్లాలో వందశాతం చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ 89.63 శాతమే పూర్తయింది.
జిల్లాలో..
పోలింగ్ కేంద్రాలు 785
మొత్తం ఓటర్లు 7,21,032
మొత్తం డిజిటలైజేన్ 6,46,230
లెక్కతేలని ఓటర్లు 74,802
మ్యాప్డ్ ఆఫ్ సెల్ఫ్
(2002లో ఓటు హక్కు ఉన్న వారు)
2,66,694
మ్యాపింగ్ కాని వారు
(2002లో లేని వారు)40,944
ఫిర్యాదులు, అభ్యంతరాలు ఈనెల 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు
తుది ఓటరు జాబితా 19 అక్టోబర్ 2026
పారదర్శకంగా ఓటరు జాబితా
మ్యాపింగ్ కాని వారు ఏదైనా ఒక ప్రూఫ్ చూపించి ఓటరు జాబితాలో అవకాశం కల్పించుకోవాలి. జిల్లాలో 40,944 మ్యాపింగ్ కాని వారు ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చారు. కానీ 2002 జాబితాలో ఓటు హక్కు చూపించలేదు. నెల రోజుల పాటు అవకాశం ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి.
– సత్యప్రసాద్, కలెక్టర్


