కోరుట్ల:‘ అన్ని ఉన్నా అల్లుని నోట్ల శని’..తీరును తలపిస్తుంది.. కోరుట్ల మున్సిపాల్టీలో యూఐడీఎఫ్ నిధులు తీరు. మున్సిపల్‌లోని పలు వార్డుల్లో కీలకమైన అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులకు సంబంధించిన టెండర్లు ముగిసి.. అగ్రిమెంట్లు జరిగి మూడు నెలల కాలం గడుస్తున్నా.. ఆయా పనుల్లో మాత్రం ప్రగతి శూన్యం. ఎందుకు ఇలా జరుగుతోంది.. అని ఆరా తీస్తే..్ఙకమీషన్ల కథాకమామీషు’ వెలుగులోకి వస్తోంది.
రూ.18 కోట్ల నిధులు
కోరుట్ల మున్సిపాల్టీలోని 33 వార్డుల్లో అవసరమైన చోట పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాది క్రితం అర్బన్ ఇన్‌ప్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.18 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలోని కీలకమైన సమస్యలకు చెల్లుచీటి పడుతుందని జనం ఆశించారు. 33 వార్డుల్లో మేజర్ డ్రైయినేజీలు, సీసీ రోడ్లు, కల్వర్టులు, వర్షపు నీటి వరద ముంపు తప్పించడానికి అవసరమైన పనులు పూర్తి అవుతాయని ఆశపడ్డారు. అధికార యంత్రాంగం టెండర్లు పిలవడంలో ఆలస్యం కావడంతో పనులు ముందుకు సాగలేదు. మూడు నెలల క్రితం టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తి చేశారు. కానీ, రెండు నెలలుగా ఏలాంటి పనులు ముందుకు సాగలేదు. ఈ జాప్యాని కారణం ఏమిటని ఆరా తీస్తే.. కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టడానికి ఊగిసలాడుతున్నట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి.. టెండర్లు పూర్తయ్యాయి. ఇక పనులు మొదలవుతాయని ఆశపడ్డ జనాలకు మాత్రం నెలల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు.
కమీషన్ల కథ..?
కోరుట్ల మున్సిపాల్టీకి కొత్త పాలకవర్గం వచ్చి సుమారు ఎనిమిది నెలల గడుస్తుండగా పెద్ద ఎత్తున మంజూరైన నిధులపై ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. కొంత మంది ప్రజాప్రతినిధులు నేరుగా తామే పనులు చేసుకుంటామని ఒత్తిడి తెస్తుండగా మరి కొంత మంది గెలుపు బాటలో లెక్కలేనంత రొక్కం వెచ్చించామని, ఎంతో కొంత కమీషన్లు ముట్టజెప్పాలన్న ప్రతిపాదనను కాంట్రాక్టర్ల ముందుకు తెస్తున్నట్లు సమాచారం. ఇదే బాటలో అధికార యంత్రాంగం..‘మేమున్నామని’ గుర్తు చేయడం మరో సమస్యగా మారింది. మున్సిపల్ కాకుండా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పరిధిలో చేసిన పనులకు ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాని క్రమంలో అతి కష్టం మీద యూఐడీఎఫ్ నిధులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు కమీషన్ల కమామీషుతో మళ్లీ ఇబ్బందులు పాలవుతామన్న బెంగతో దిగులుపడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే టెండర్లు పూర్తయిన తరువాత కాంట్రాక్టర్లు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.
త్వరలో ప్రారంభిస్తాం
యూఐడీఎఫ్ నిధులకు సంబంధిచి పనుల టెండర్లు అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయి. త్వరలో ఈ పనులు ప్రారంభిస్తాం. ఈ పనులతో పట్టణంలోని కీలక సమస్యలు చాలా మేర తొలగిపోతాయి. – అరుణ్‌కుమార్,
డీఈ మున్సిపల్, కోరుట్ల


