● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత జయశంకర్ అని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే నివాళి అన్నారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ఏవో శశికళ, సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిపాలతో రోగనిరోధక శక్తి
● జిల్లా సంక్షేమాధికారి భాస్కర్
మల్యాల: తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పుట్టినప్పుడే పిల్లలకు ముర్రుపాలు తాగించాలని జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ అన్నారు. మల్యాల మండలకేంద్రంతోపాటు మద్దుట్ల గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. భాస్కర్ మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. సర్పంచులు బొట్ల జయ ప్రసాద్, సంకూర్తి తిరుపతి, సీడీపీవో వీరలక్ష్మీ, బాలింతలు, గర్భిణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
38.799 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటిమట్టం
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటల వరకు 38.799 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,446 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 38.799 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుండి 974 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
రౌడీషీటర్లపై నిఘా పెంచాలి
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ కోసం రౌడీషీటర్లు, హిస్టరీషీట్లలో ఉన్న వారిపై నిఘా పెంచాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణ, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై తీసుకునే చర్యలపై పోలీసు అధికారులతో గురువారం సమీక్షించారు. అవసరమైన సందర్బాల్లో బైండోవర్ చేయాలన్నారు. అనుమానాస్పద అల్లర్లలో ప్రమేయమున్న వారిని ప్రతినెలా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రవికుమార్, సీఐలు సుధాకర్, కరుణాకర్, రాం నర్సింహారెడ్డి, రాజ్‌కుమార్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు
రాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బట్టు అనన్య, ఆర్.రాహుల్, శిరీష రాష్ట్రస్ధాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు. హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం పోరండ్ల కిరణ్, సర్పంచ్ ఎంబారీ గౌతమి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


