కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో టాస్క్, ఐబీఎం, ఎడ్‌నెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీటెక్ మూడో సంవత్సరం ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థులకు నిర్వహించిన మూడు రోజుల ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ ముగిసింది. శిక్షణలో ఐబీఎమ్, ఎడునెట్ మాస్టర్ ట్రైనర్ పి.అజయ్ రెడ్డి ఏఐ మోడలింగ్, ఐబీఎం బీవోబీ టూల్, రాగ్ ఆధారిత సాంకేతికతపై వివరించారు. విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ప్రిన్సిపాల్ నరసింహ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికరంగాల్లో నైపుణ్యాలు విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపారు. టీపీవో సతీష్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈవీ సాంకేతికతపై శిక్షణ
జేఎన్టీయూలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో మ్యాథ్‌వర్క్స్ ఇండియా, ఆర్కాస్ ఇన్ ఇండియా సంస్థల సహకారంతో మ్యాథ్‌ల్యాబ్, సిమ్యులింక్ ఆధారిత విద్యుత్ వాహన సాంకేతికతపై రెండురోజుల శిక్షణ శిబిరం గురువారం ప్రారంభమైంది. థర్డ్, ఫోర్తియర్ బీటెక్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ శిక్షణను కళాశాల ప్రిన్సిపాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఈఈఈ విభాగాధిపతి సి.రాధాచరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జీవో 1,181 ఉపసంహరించుకోండి
జగిత్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, వర్క్ ఇన్స్‌పెక్టర్ల వేతనాలను తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1181ని ఉపసంహరించుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం సీఎంకు లేఖ రాశారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో జీవితం నెట్టుకొస్తున్నారని తెలిపారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


