మంచిర్యాలరూరల్(హాజీపూర్): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన పోతురాజుల గంగవ్వ(75) గాంధారీ ఖిల్లా దర్శనానికి వచ్చి తిరుగువెళ్లే క్రమంలో అటవీ ప్రాంతంలో తప్పిపోయింది. కుటుంబ సభ్యులు పోలీస్, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. గురువారం రాత్రి అటవీ క్షేత్రాధికారి సంతోష్ ఆదేశాల మేరకు గాంధారిఖిల్లా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో భాగంగా జంతువుల కదలికల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు గంగవ్వ ఫొటో చిక్కింది. దీంతో నిర్ధిష్టమైన ప్రణాళికతో పోలీస్, అటవీ అధికారులు మరింతగా గాలింపు చేపట్టగా రాత్రి 9 గంటల ప్రాంతంలో సఫారీ 1వ గేట్ వద్ద గంగవ్వను గుర్తించారు. అనంతరం వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


