దూరం నెలవారీ మూడు నెలలకు
(కిలోమీటర్లు) రుసుము(రూ.లో)
5 275 650
10 425 1,070
15 500 1,400
20 650 1,775
25 725 2,075
30 800 2,300
35 875 2,450
● కరీంనగర్ ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కౌంటర్లు ● అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచన
కరీంనగర్‌టౌన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ బస్‌పాసులు అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల పరిధిలో విద్యార్థులకు ఉచిత, రాయితీ బస్సు పాసులు పంపిణీ చేస్తున్నారు. విద్యాసంస్థలకు బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. బస్‌పాస్‌ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
35 కిలోమీటర్ల పరిధి వరకే
పన్నెండేళ్లు దాటిన బాలురు, ఇంటర్, డిగ్రీ, ఇతర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 35 కిలోమీటర్ల పరిధిలో రాయితీ బస్‌పాస్‌లు మంజూరు చేస్తారు. ప్రయాణ దూరాన్ని బట్టి పాస్ రుసుం నిర్ణయిస్తారు. పాస్ గుర్తింపు కార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పన్నెండేళ్లలోపు బాలురు జిల్లా పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సమీపంలోని బస్సుపాస్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ జారీకి రూ.50 గుర్తింపు కార్డు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు ఆధార్ కార్డు ఆధారంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా, బాలురకు బస్ పాస్ పథకం ద్వారా ప్రయాణ భారం తగ్గనుంది.
ప్రైవేటు విద్యాసంస్థలకు డీడీ రూపంలో
ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రాయితీ బస్సు పాస్‌లు అందించాలంటే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించిన వార్షిక రుసుం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. అనంతరం సంస్థలకు ప్రత్యేక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ కేటాయించి విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.


