ఈనెల 11 వరకు ‘దోస్త్‌’కు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఈనెల 11 వరకు ‘దోస్త్‌’కు దరఖాస్తులు

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

జగిత్యాల: ఎస్‌కేఎన్‌ఆర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్లకు ఈనెల 11 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రిన్సిపల్‌ ఇందిరాదేవి తెలిపారు. 12వరకు వెబ్‌ఆప్షన్ల ద్వారా కళాశాలలు, కోర్సులు ఎంపిక చేసుకోవచ్చని, 14న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలన్నారు. సీట్ల కేటాయింపు ఈనెల 22న ఉంటుందని, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌, బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌, బీకాం కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌, బీఏ ఇంగ్లిష్‌ మీడియం, బీఏ తెలుగు మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని వైస్‌ ప్రిన్సిపల్‌ ఆడెపు శ్రీనివాస్‌, దోస్త్‌ కో–ఆర్డినేటర్‌ సాయిమధుకర్‌, రాజు, గోవర్దన్‌, శ్రీనివాస్‌ తెలిపారు.

నిబంధనల మేరకు నిర్ణయం

జగిత్యాల: ఎన్‌హెచ్‌–563 విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. రైతులతో బుధవారం సమావేశమయ్యారు. బాధితుల పరి హారానికి సంబంధించి 189 కేసులపై విచారణ చేపట్టామన్నారు. భూ యజమానుల తరఫున న్యాయవాదులు వాదనలు విన్పించారని తెలిపారు. ఆర్డీవోలు మధుసూదన్‌, జివాకర్‌రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ హారిణి, సూపరింటెండెంట్‌ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో గతనెల 30న స్కూల్‌ వ్యాన్‌ ఢీకొని గాయపడిన సల్వల రాజేశ్‌ (28) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వర్షకొండ గ్రామానికి చెందిన రాజేశ్‌ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మెట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్‌ పిల్లలను దింపి వస్తోంది. మూలమలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేశ్‌ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రాజేశ్‌ 25రోజుల క్రితమే సౌదీ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతడి తల్లి నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గణేశ్‌పల్లికి చెందిన వ్యక్తి..

జగిత్యాలరూరల్‌: సారంగాపూర్‌ మండలం గణేశ్‌పల్లి పోతారం గ్రామానికి చెందిన యాకసిరి సుబ్రహ్మణ్యం (29) అప్పుల బాధతో ఈనెల 3న పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కళ్లను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మృతుడి భార్య గంగజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. కార్యక్రమంలో ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రి టెక్నీషియన్‌ ప్రవీణ్‌, ఎస్సై గీత, ఫోరెన్సిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఐటీఐ విద్యార్థి ..

మల్యాల:ప్రమాదవశాత్తు నోట్లోకి గడ్డిమందు వెళ్లి ఐటీఐ విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై ఎస్‌.సందీప్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని గొర్రెగుండం గ్రామానికి చెందిన ఎడ్ల లచ్చయ్య, మమత కుమారుడు మనోహర్‌(18) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 12న పొలంలో గడ్డిమందు పిచికారి చేసే సమయంలో నోట్లోకి వెళ్లడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే జగిత్యాల అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మద్యానికి బానిసై..

మల్యాల: నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీకి చెందిన మతిన్‌ (39) మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్‌ బెడ్‌ రూం కాలనీలో నివాసం ఉంటున్న మతిన్‌ భార్య హీనతబుస్సం కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లి అక్కడే నివసిస్తోంది. మతిన్‌ మానసికంగా కుంగిపోయి, మద్యానికి బానిసయ్యాడు. బుధవారం తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మతిన్‌ తల్లి కమర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement