స్వరశంఖాలు
సంగ్రామంలో
● అభ్యర్థులకు వ్యాఖ్యాతలుగా సిరిసిల్ల గొంతులు ● ఆ గొంతులు వింటేనే ఓటర్లు ఫిదా
● ఎన్నికల నేపథ్యంలో వేలాది మందికి ప్రచారబాణీలు
సిరిసిల్లటౌన్: ఊరుపోరులో సిరిసిల్ల స్వరాలు మార్మోగుతున్నాయి. ఏ ఎన్నిక అయినా వారి గొంతులే వినిపిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా వినిపించే మృదుమధుర గొంతులు సిరిసిల్ల వాసులవే. పట్టణానికి చెందిన ఎండీ సలీం, సాంబారి రాజు గొంతులు అభ్యర్థుల తరఫున ఓట్లను అడుగుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా గొంతు వీరిదే. వీరి స్వర విన్యాసాలపై ప్రత్యేక కథనం.
సిరిసిల్లకు చెందిన ఎండీ సలీం ఎన్నికల ప్రచార స్వరకర్తగా పేరుంది. సలీం స్వర ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. పదోతరగతి చదివే రోజుల్లో అప్పుడే ప్రారంభమైన పట్టణంలోని శ్రీలక్ష్మి థియేటర్‌లో ఆడే సినిమాలకు సంబంధించిన ప్రచారంతో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు. ‘రోజూ నాలుగు ఆటలు నేడే చూడండి..’ అంటూ మొదలైన స్వరప్రస్థానం ఎన్నికలు వచ్చాయంటే మరింత మారుమోగుతుంది. ఇందిరాగాంధీ నుంచి కేసీఆర్, ఎమ్మెస్సార్, కేటీఆర్, భాగారెడ్డి, నర్సింగరావు, గొట్టె భూపతితోపాటు ఇప్పటి వార్డు, కౌన్సిలర్ల వరకు ఎన్నికలు ఎక్కడ జరిగినా సలీం స్వరం ప్రచారాస్త్రమైంది. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు సలీం గళం పరిచయమైంది. 1988లో ఆకాశవాణిలో 25 నిమిషాల ప్రత్యక్ష వ్యాఖ్యానం, 1989లో ఘంటసాల ఆలపించిన పాటలకు తన గొంతుతో వ్యాఖ్యానం చేశారు. అనంతర కాలంలో చాలా ఏళ్లు న్యూస్ చానల్‌లో న్యూస్‌రీడర్‌గా రెండో ప్రస్థానం ప్రారంభించారు. సలీం ప్రతిభకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి.
సిరిసిల్లకు చెందిన మరో వ్యాఖ్యాత సాంబారి రాజు. గురువు సలీం వ్యాఖ్యానికి తీసిపోకుండానే ప్రకటనలకు స్వరం అందిస్తున్నారు. 1982, జూన్ 16న సిరిసిల్లకు చేనేత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటేశం, బాలలక్ష్మి. ఆరో తరగతి వరకు చదువుకున్న రాజు, తన బాబాయ్ సాంబారి ప్రదీప్ నడిపే ఆర్కెస్ట్రాలో ప్రవేశించాడు. పదిహేనేళ్ల క్రితం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన ప్రస్థానం నేడు ఎన్నికల ప్రచారం, ప్రకటనలకు స్వరం అందించే స్థాయికి ఎదిగారు. ఇరవై ఏళ్లుగా 20వేలకు పైగా వ్యాపార, ఎన్నికల ప్రకటనలకు తన స్వరాన్ని అందించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రస్తుతం ఆన్‌లైన్ సేవలనూ అందిస్తున్నారు. సమాచారం పంపితే చాలు వాయిస్ ఓవర్ సిద్ధం చేసి, మెయిల్ చేసేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, సుంకె రవిశంకర్, గంపగోవర్ధన్, షబ్బీర్ అలీ ఎన్నికల్లో నిల్చోగా వారి ప్రచారంలో తన గొంతు అందించారు.
సలీం గొంతుకు సలాం
స్వర‘రాజ’సం
ప్రాంతీయ యాసల్లో వ్యాఖ్యానం
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ యాసల్లో వారు కోరిన విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాను. గురువు గారు సలీం స్ఫూర్తితో 20 ఏళ్లుగా వ్యాఖ్యానంలో కొనసాగుతున్నాను. నాతో పాటుగా ఫిమేల్ వాయిస్‌కు స్థానిక మహిళ స్వాతి గొంతు అందిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ప్రకటనలు చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ప్రకటనలు విరివిగా చేస్తున్నాం
– సాంబారి రాజు, సిరిసిల్ల
స్వరశంఖాలు


