డ్రైనేజీ నీరు చెరువుల్లోకి..! | - | Sakshi
Sakshi News home page

డ్రైనేజీ నీరు చెరువుల్లోకి..!

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

● ముందుకు కదలని సివరేజ్‌ ట్రీట్‌ ప్లాంట్లు ● మోక్షంలేని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ● కలుషితనీటితో ప్రజలు సతమతం

జగిత్యాల: జిల్లా కేంద్రం చుట్టూ మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, లింగం చెరువు, ముప్పారపు చెరువులు ఉన్నాయి. అయితే అండర్‌ డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో ఇళ్లనుంచి వెలువడే మురుగునీరంతా ఈ చెరువుల్లోకే చేరుతోంది. ఫలితంగా నీరంగా పూర్తిగా కలుషితమవుతోంది. భూగర్భజలాలు పెంచాల్సిన ఈ చెరువులు కలుషితమై ప్రజలకు లేని రోగాలను తెచ్చిపెతున్నాయి. సివరేజీ ట్రిట్‌మెంట్‌ ప్లాంట్లు లేకపోవడం, అండర్‌ డ్రైనేజీ సిస్టం లేకపోవడం ఇబ్బందిగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని ఏ డ్రైనేజీ నుంచి వచ్చిన నీరైనా ముప్పారపు, మోతె చెరువుల్లోకే వెళ్తోంది. గతంలో ఈ చెరువుల్లోకే కాలువలు ఏర్పాటు చేయడం గమనార్హం. అక్కడ సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే నీరు కలుషితం కాకుండా ఉండే అవకాశం ఉంది. గొల్లపల్లి రోడ్‌లో గల సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిక వద్ద డ్రైనేజీలో వ్యర్థాలు పడేస్తుండటంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురికావడంతోపాటు, ఈ చెత్తంతా ముప్పారపు చెరువులో కలిసి కలుషితం అవుతోందని కౌన్సిలర్‌ సిరికొండ పద్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిత్యం ఇలా చాలా మంది చెరువులు కలుషితంతో పాటు, కబ్జాకు గురవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆక్రమణలు ఎక్కువ

ఈ కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ మురికినీరు నిలిచిపోతోంది. పైగా కాలువలు ఆక్రమణలకు గురికావడంతో మురుగు నీరంతా చెరువులోకే పోతోంది. చుట్టూ శివారు ప్రాంతాలతో పాటు చెరువుల సమీపంలో ఉన్న భూములు రేట్లు అధికంగా పలకడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. బఫర్‌ జోన్‌ సమీపంలో ఉన్న గానీ ఆక్రమణలు చేస్తూ మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు.

చెరువులు కబ్జా..

వాస్తవానికి చెరువులు తాగునీటి అవసరాలకు.. భూగర్భజలాల పెంపు కోసం ఉపయోగపడాలి. కానీ.. జిల్లాకేంద్రం నుంచి వెలువడే వ్యర్థపు నీరంతా ఇందులోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు మిషన్‌ కాకతీయ అంటూ చెరువుల్లో పూడికతీస్తున్నా.. గ్రామాలను కాపాడుకుంటున్నా జిల్లాకేంద్రంలోని నాలుగు చెరువులు మాత్రం కబ్జాకు గురవుతున్నాయి. చికెన్‌ వ్యర్థాలు, మానవుల మలవిసర్జన, పట్టణంలోని మురికినీరు, చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నీ చెరువులోకే వెళ్తున్నాయి.

సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఎప్పుడు?

మురికినీరు కలుషితం కాకుండా దానిని శుభ్రం చేసి బయటకు పంపేందుకు చెరువులవద్ద గానీ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తుంటారు. కానీ జిల్లా కేంద్రం అయినప్పటికీ ఎక్కడ కూడా సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు లేవు. ఇటీవలే ఆస్పత్రిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. అలాగే చెరువుల వద్ద అవసరమున్న చోట్లలో ఈ డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణప్రజలు కోరుతున్నారు.

చేపలకు కలుషిత ఆహారం

ఈ చెరువుల్లో మత్స్యకారులు ఎక్కువగా చేపలు వేసుకుని పెరిగాక పట్టుకుని అమ్ముకుంటూ జీవిస్తుంటారు. డ్రైనేజీ నీరంతా అందులోకే వెళ్లడంతో చేపలు కొనేందుకు కొందరు సంశయం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో ఎక్కువగా ఈ చెరువుల్లో పెంచిన వాటినే అమ్ముతుంటారు. నీరు అందులో కలుషితం కావడంతో చేపల వ్యాపారం కూడా తగ్గుతోందని ఇటీవల మాజీమంత్రి జీవన్‌రెడ్డికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి రజినీకాంత్‌ వినతిపత్రం అందించారు. చెరువులను కాపాడటంతో పాటు, హైదరాబాద్‌లో లాగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి పట్టణంలోని గోవిందుపల్లిలోని తుమ్మలకుంట, మోతెచెరువు, ముప్పారపు చెరువు, కర్నకుంట చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఎక్కడ?

నిధులు మంజూరయ్యాయి

చెరువులు శుభ్రం చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటాం. కలుషితం కాకుండా చూస్తాం. సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

– స్పందన, మున్సిపల్‌ కమిషనర్‌

రెండేళ్ల జిల్లా కేంద్రంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. అయినా డ్రైనేజీలే సక్రమంగా లేకుండా పోతున్నాయి. దీంతో చెరువులకు శాపంగా మారింది. శివారు ప్రాంతాల్లో అత్యధికంగా ఇళ్లు పూర్తవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం డ్రైనేజీలు నిర్మిస్తున్నారుగానీ ఆ నీరంతా ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆ నీరు నాలుగు చెరువుల్లోకి చేరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement