జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు పండ్లతోటలకు ప్రతికూలంగా మారాయి. పూత, పిందె దశ నుంచే తెగుళ్లు ఆశిస్తున్నాయి. మామిడి, కర్బూజ, దోసకాయ వంటి పంటలను పురుగులు ఆశించడంతో పూత, పిందె రాలిపోతోంది. తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పురుగులకు అనువైన వాతావరణం
జిల్లాలో మామిడి 40వేల ఎకరాల్లో సాగవుతోంది. కర్బూజను సుమారు 6 వేల ఎకరాలు, దోస రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. పండ్ల తోటలను పూత దశ నుండే బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు, తామర పురుగులు(త్రిప్స్), పండు ఈగలు, తేనెమంచు వంటి పురుగులు ఆశించి భారీగా నష్టం చేస్తున్నాయి. పండ్లతోటల్లో పూత నుండి పిందెకు మారే దశ కీలకం. ఈ సమయంలోనే పురుగులు ఆశించి పూతలోని రసాన్ని పీల్చివేస్తున్నాయి. పూత ఎండిపోయి, రాలిపోతోంది. పచ్చగా ఉన్న ఆకులు ఎరుపు రంగులోకి నిర్జీవంగా మారుతున్నాయి. పిందెలు కాయలుగా మారడం లేదు. కాయలు పెద్దగా కావడం లేదు. దీనంతటికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలం నుంచి ఎండకాలానికి మారే దశలో పురుగులు మొక్కలోకి చొచ్చుకెళ్లేందుకు అనువైన వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో బూడిద తెగులు, తామర పురుగుల ఉధృతి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినా.. ఒక్కసారిగా పడిపోయినా పురుగులు, తెగుళ్లకు అనువైన వాతావరణం ఏర్పడి పండ్లతోటలపై పంజా విసురుతాయి. పురుగులు సన్నగా, చిన్నగా ఉండి పూ మొగ్గలు, కొత్త చిగుర్ల చివరలో దాగి ఉండి, పంటకు నష్టం కలిగిస్తాయి. తేమతో కూడిన అనువైన వాతావరణం కొన్ని పురుగుల విజృంభనకు కారణమైతే.. పొడి వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరికొన్ని పురుగుల విజృంభణకు ప్రధాన కారణంగా మారాయి. ఆయా సమయాల్లో పురుగులు తమ సంతతిని వృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
రసాయనాల పిచికారీ
రైతులు తమ పండ్లతోటలను కాపాడుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. ఇప్పటివరకు మామిడి రైతులు ఐదుసార్లు, కర్బూజ రైతులు ఆరుసార్లు, దోస రైతులు ఐదుసార్ల చొప్పున రసాయనాలను మార్చుతూ పిచికారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒక్కసారి పిచికారీకి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఇప్పటివరకు మామిడి రైతులు అన్ని ఖర్చులు కలుపుకొని ఎకరానికి దాదాపు రూ.80 వేల వరకు ఖర్చు పెట్టారు. కర్బూజ రైతులకు దాదాపు రూ.60వేల వరకు, దోస రైతులకు రూ.15వేల వరకు ఖర్చు చేశారు. కొందరు రైతులు సేంద్రియ పద్ధతిలో పురుగులను అదుపులోకి తీసుకొచ్చే ప్ర యత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో తోటలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


