మంట | - | Sakshi
Sakshi News home page

మంట

Mar 12 2026 7:38 AM | Updated on Mar 12 2026 7:38 AM

● 38 డిగ్రీల సెల్సియస్‌ దాటిన పగటి ఉష్ణోగ్రతలు ● ఏప్రిల్‌, మే నెలల్లో మరింత పెరిగే అవకాశం ● పంటలపై తీవ్ర ప్రభావం

మార్చిలోనే

జగిత్యాలఅగ్రికల్చర్‌: మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి.

పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 38 డిగ్రీల సెల్సియస్‌కు

చేరుకున్నాయి. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దంతా వేడితో ఉక్కపోత ఉంటున్నప్పటికీ.. ఉదయం సమయానికి వాతావరణం చల్లగా మారుతుండటం విశేషం. ప్రధానంగా యాసంగిలో సాగుచేసిన పంటలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ఉత్తర, వాయువ్యం నుంచి వీచే వేడిగాలులతోపాటు శీతాకాలంలో చల్లదనాన్ని ఇవ్వడంలో క్రీయాశీలకంగా వ్యవహరించే పశ్చిమ దిశగా వీచే గాలులు బలహీనపడ్డాయి. దీనికితోడు ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులతో మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయిని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశం నిర్మలంగా ఉండటం, వర్షపాతం తగ్గడం.. ఆకాశంలో మేఘాలు లేకపోవడం.. సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడడంతో భూమిని వేడి చేస్తున్నాయి. మార్చిలో సాధారణంతో పోల్చితే 3నుంచి 7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పెరుగుతున్న భూతాపం వల్ల చలికాలం తగ్గి, ఏప్రిల్‌, మే నెలల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదు కావడానికి కారణమవుతున్నాయి.

గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలు

జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌గా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. బీర్‌పూర్‌ మండలం కొల్వాయి, కోరుట్ల మండలం అయిలాపూర్‌, మల్లాపూర్‌, సారంగాపూర్‌, కథలాపూర్‌, వెల్గటూర్‌, మల్లాపూర్‌ మండలం రాఘవపేట, ఇబ్రహీంపట్నం గోధూర్‌, ధర్మపురి మండలం జైనా, రాయికల్‌ మండలం అల్లీపూర్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాలరూరల్‌ మండలాల్లో బుధవారం 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి కొద్ది రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లేవారు తేలికపాటి దుస్తులు ధరించడంతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని తాగడం, సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని, టోపి, టవల్స్‌ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35నుంచి 37, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమ ఉదయం 68 నుంచి 75 శాతం, మధ్యాహ్నం 51 నుంచి 59శాతం నమోదవుతాయి. వడగాలులు గంటకు రెండు పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

– బి.శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస

పంటలపై తీవ్ర ప్రభావం

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో వరిలో కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశిస్తుంది. నువ్వు పంటలో రసం పీ ల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల ఆరుతడి, పండ్ల, కూరగాయల పంటలకు వారం వ్యవధితోనే సాగు నీటిని ఇవ్వాలి. – హరీష్‌కుమార్‌ శర్మ,

పరిశోధన స్థానం డైరెక్టర్‌, పొలాస

ఈ ఏడాది సాధారణానికి మించి..

జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒకటిరెండు డిగ్రిలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణంలో వేడితోపాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌ అంటున్నారు. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా ఉపయోగించడం ద్వారా గ్రీన్‌హౌస్‌ వాయువులైన కార్బన్‌డయాకై ్సడ్‌, మిథేన్‌ వాతావరణానికి హానికరంగా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement