నిబంధనలు తూచ్‌..! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తూచ్‌..!

Mar 12 2026 7:38 AM | Updated on Mar 12 2026 7:38 AM

ఈనెల 13న కోరుట్ల బల్దియా బడ్జెట్‌ మీటింగ్‌ కౌన్సిలర్లకు వారంముందే ఇవ్వాల్సిన సమాచారం పట్టని అధికారులు.. అడిషనల్‌ కలెక్టర్‌కు కౌన్సిలర్ల ఫిర్యాదు

కోరుట్ల: కోరుట్ల మున్సిపల్‌ మొట్టమొదటి బడ్జెట్‌ సమావేశం ఏర్పాటులోనే బల్దియా అధికారులు నిబంధనలు విస్మరించారని ఆరోపిస్తూ పలువురు కౌన్సిలర్లు అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త పాలకవర్గం ఏర్పాటు అనంతరం ఈనెల 13న మొదటిసారి బడ్జెట్‌ సమావేశం ఏర్పాటుకు కమిషనర్‌ రవీందర్‌ నిర్ణయించారు. సాధారణంగా ప్రతి మున్సిపాలిటీలో బడ్జెట్‌ సమావేశం అత్యంత కీలకం. బల్దియాకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, పన్నులు, ఇతరత్రా పథకాల ద్వారా సమకూరిన నిధులను ఎలా సద్వినియోగం చేయాలన్న విషయంలో పూర్తి చర్చకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బడ్జెట్‌ ప్రతులను సమావేశానికి ఏడు రోజులు ముందుగానే కౌన్సిలర్లకు అందించాలన్న నిబంధన ఉంది. ఈ ఏడు రోజులు కూడా పనిదినాలుగానే ఉండాలి. ఏడు రోజులు ముందుగా బడ్జెట్‌ ప్రతులు అందితే.. కౌన్సిలర్లు వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని మంచిచెడుపై సమావేశంలో అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆస్కారం చిక్కుతుంది. ఆ ఉద్దేశంతోనే వారం ముందుగా సమాచారం ఇవ్వాలన్న నిబంధన రూపొందించారు. దీనికితోడు ప్రస్తుత పాలకవర్గంలో మూడోవంతు కౌన్సిలర్లు కొత్తవారు కావడంతో వీరికి బడ్జెట్‌ నిధుల కేటాయింపు వంటి అంశాలపై అవగాహనకు సమయం అవసరం. కనీస అవగాహనకు అవకాశం ఇవ్వకుండా ఆదరాబాదరాగా బడ్జెట్‌ సమావేశం పెట్టడంపై బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లతోపాటు కొంతమంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

నిబంధనలు బేఖాతరు..

అత్యంత కీలక సమావేశం నిర్వహణలో అధికారుల ఏమరుపాటు ఇబ్బందికరంగా మారింది. కోరుట్ల మున్సిపల్‌ అధికారులు ఈనెల 13న బడ్జెట్‌ సమావేశం ఉంటుందని నిర్ణయించారు. ఈ సమావేశానికి సంబంధించిన ప్రతులపై 9వ తేదీగా ముద్రించి 10వ తేదీ సాయంత్రం కౌన్సిలర్లకు బడ్జెట్‌ మీటింగ్‌ ప్రతులను పంపించారు. ఈ లెక్కన కేవలం మూడు రోజుల ముందుగా బడ్జెట్‌ మీటింగ్‌ సమాచారం కౌన్సిలర్లకు అందించినట్లు లెక్క. నిబంధనలను పక్కన పెట్టి ఆలస్యంగా బడ్జెట్‌ మీ టింగ్‌ సమాచారం కౌన్సిలర్లకు ఇవ్వడం వెనుక ము న్సిపల్‌ అధికారుల ఆంతర్యం ఏమిటన్న విషయంలో స్పష్టత చిక్కడం లేదు. డీఎంఏ కార్యాలయం నుంచి బడ్జెట్‌ మీటింగ్‌ ఈనెల 15లోపు నిర్వహించాలని సమాచారం ఇచ్చారని, ఆ మేరకు తాము అత్యవసరంగా సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేశామని మున్సిపల్‌ అధికారులు చెబుతుండడం గమనార్హం. డీఎంఏ కార్యాలయం నుంచి బడ్జెట్‌ సమావేశం సమాచారం వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం వారం గడువు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అఽధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement