Sakshi News home page

దేశసేవకు మించింది లేదు

Published Thu, Apr 18 2024 10:30 AM

- - Sakshi

 మూడు రెట్ల వేతనం వదలుకొని సివిల్స్‌కు మొగ్గు

సొంత మెటీరియల్‌తో రోజుకు 4 గంటలు చదివా

 సోషల్‌ మీడియాకు దూరంగా లేను

 పేదరికం, కుటుంబ సమస్యలు చూసి దిగులొద్దు

 ప్రణాళిక ప్రకారం చదివితే సివిల్స్‌ కష్టమేమీ కాదు

 ‘సాక్షి’తో 27వ ర్యాంకర్‌ సాయికిరణ్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘దేశ సేవకు మించింది లేదు.. సమాజానికి మేలు చేసే పనితో పోలిస్తే డబ్బుకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు.. అందుకే, మూడు రెట్ల అధిక జీతం వదులుకొని సివిల్‌ సర్వీస్‌లో చేరబోతున్నాను.. పేదలు, సమాజం కోసం పాటుపడేందుకు, వారిని ఆదుకునేందుకు సివిల్స్‌ గొప్ప వేదిక.. ఐదేళ్ల క్రితం మొదలైన సివిల్స్‌ వేట మొన్నటి ఫలితాలతో పూర్తయింది. పేదరికం, కుటుంబ సమస్యలు సివిల్స్‌ సాధనలో అసలు ఆటంకాలే కావు.. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదు’ అన్నారు సివిల్స్‌ ఆలిండియా 27వ ర్యాంకర్‌ నందాల సాయికిరణ్‌. తాను సివిల్స్‌కు ఎంపికై న తీరు, విజయం సాధించిన క్రమాన్ని బుధవారం తన స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు.

కల కోసం శ్రమించాను..
సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్‌ఈసీ వరంగల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్‌ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్‌ కలకు అక్కడే బీజం పడింది.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీలు కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్‌ లక్ష్యాన్ని చేరుకోగలిగాను.

పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం..
నేటి యువతకు సివిల్స్‌ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్‌ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. మాక్‌ ఇంటర్వ్యూలు కూడా ఆన్‌లైన్‌లో అటెండ్‌ అవ్వొచ్చు.

సాధిస్తానన్న నమ్మకంతో చదివా..
సివిల్‌ సర్వీసెస్‌ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్‌ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్‌నెట్‌ నుంచి తీసుకునేవాడిని. ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్‌ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను. ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్‌ పార్టీ ఎవాల్యుయేషన్‌ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్‌లైన్‌లోనే మాక్‌ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్‌ ప్రిపేరవుతున్నా సోషల్‌ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను.

Advertisement

తప్పక చదవండి

Advertisement