మెట్‌పల్లి మండలంలో ఐదు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చెర్లకొండాపూర్, రామారావుపల్లె, పాటిమీదితండా, ఏఎస్‌ఆర్ తండా, కేసీఆర్‌తండా గ్రామాలను 2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో పాలనపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేనప్పటికీ సరిహద్దు విషయాల్లో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాజేశ్వర్‌రావుపేట వీడీసీ సభ్యులపై ఫిర్యాదు
మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట వీడీసీ సభ్యులు చెర్లకొండాపూర్ గ్రామస్తుల విషయంలో ఆంక్షలు విధించారని చెర్లకొండాపూర్ ప్రజలు మెట్‌పల్లి డీఎస్పీ రాములుకు ఫిర్యాదు చేశారు. మెట్‌పల్లిలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం డీఎస్పీని కలిసిన చెర్లకొండాపూర్ గ్రామస్తులు.. రాజేశ్వర్‌రావుపేట వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెర్లకొండాపూర్ ప్రజలకు రాజేశ్వర్‌రావుపేట గ్రామస్తులు పాలు పోయరాదని, కిరాణసరుకులు, చికెన్ విక్రయించరాదని, గేదెల కాపరిగా వెళ్లరాదని, చాయ్ పోయరాదని, ఏ విషయంలోనూ సహకరించరాదని, సహకరిస్తే రూ.5 వేలు జరిమానా విధించేలా తీర్మానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మెట్‌పల్లిరూరల్: కొత్త గ్రామ
పంచాయతీలను సరిహద్దు సమస్యలు
వెంటాడుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా గ్రామాలు అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నప్పటికీ.. కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. విలీనమైన, కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు సరిహద్దు విషయాల్లో వివాదాలు తలెత్తున్నాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదాలు ఏటూ తేలకపోవడం సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సరిహద్దు పంచాయతీల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు జోక్యం చేసుకోవడంతో మరింత ముదురుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


