● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: దేశంలో చేపట్టనున్న జనగణనలో కులగణన చేసి బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉద్యోగకల్పనతోపాటు సామాజిక న్యాయం చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. దేశ జనాభా లెక్కలు తేల్చేందుకు జనగణన చేపట్టబోతున్నామని గతంలో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కులగణన కూడా చేపట్టాలన్నారు. కేవలం జనగణనతో ఆశించిన ఫలితాలు రావన్నారు. కులగణన అంశాన్ని అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల మద్దతుతో కేంద్రానికి నివేదిక పంపాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో జనగణనలో కులగణన జరిపేలా ప్రస్తావించాలన్నారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, దేవేందర్‌రెడ్డి, అబ్దుల్ బారి, చాంద్ పాష ఉన్నారు.


