జగిత్యాల: ఈనెల ఆరో తేదీ నుంచి జూన్ 12వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన.. ప్రగతి పాలనను 99రోజులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలని, పారిశుధ్యం, ఉపయోగంలో లేని ఫర్నిచర్, వస్తువులు తొలగించాలని, టాయిలెట్స్, పరిసరాలు, పార్కింగ్ స్థలాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీకేంద్రాలకు మరమ్మతు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలపై మండలాల వారీగా నివేదిక సమర్పించాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు లైంగిక వేధింపుల కమిటీలు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఇందిరా మహిళాశక్తి భవనాలు పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడీలు, సీసీరోడ్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. 5కే రన్, 2కే రన్, మారథాన్, యోగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలన్నారు. ఉపయోగంలో లేని బావులను పూడ్చివేయాలన్నారు. కుక్కలకు కు.ని చేయించాలని కమిషనర్లను ఆదేశించారు. రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. మహాలక్ష్మీ, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు.


