ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Without Us There Would Be No Israel: Trump | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 16 2026 5:52 PM | Updated on Jun 16 2026 6:27 PM

Without Us There Would Be No Israel: Trump

అమెరికా లేకుంటే ఇజ్రాయెల్‌ ఉండేది కాదంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించిన ఘనత తనదేనంటూ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మనుగడ, భద్రత.. అమెరికా మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించడంలో తన సొంత విధానాలే నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు. తాను చేసిన పనులను చేయడానికి మరే ఇతర అధ్యక్షుడూ సిద్ధంగా లేరన్నారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో తనకున్న సంబంధాలు బలంగా ఉన్నాయని వివరిస్తూనే.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్.. లెబనాన్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రముఖ నిపుణులకు నిలయంగా ఉన్న లెబనాన్.. కాలక్రమేణా తీవ్రంగా క్షీణించిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.

లెబనాన్,  హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుపై తాను సంతృప్తిగా లేనన్నారు. ఈ ఘర్షణ చాలా కాలంగా సాగుతోందని.. ఇది ఇరాన్‌తో ఇటీవలే కుదిరిన ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. ఇజ్రాయెల్‌కూడా శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి. శుక్రవారం లోపు హర్మూజ్‌ పూర్తి ఓపెన్‌ అవుతుంది. ఇకపై హర్మూజ్‌లో టోల్‌ ఫీజు ఉండదన్న ట్రంప్‌.. ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్నారు.

కాగా, దాదాపు 107 రోజులుగా హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్‌ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్‌ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్‌ ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని.. అయితే, అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్‌ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉందని.. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ లక్ష్యమంటూ మరోసారి తేల్చి చెప్పారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement