అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా? | Wedding of the Century: Why Italy City Divided ahead of billionaire Event | Sakshi
Sakshi News home page

Wedding of the Century: అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?

Jun 21 2025 8:22 PM | Updated on Jun 21 2025 8:44 PM

Wedding of the Century: Why Italy City Divided ahead of billionaire Event

ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ  పెళ్లి గోల ఏంటంటే..

అమెరికా టెక్‌ దిగ్గజం జెఫ్‌ బెజోస్‌(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్‌ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్‌లో జూన్‌ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.

వెనిస్‌లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్‌లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్‌ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట.  ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా..  విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు.  ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని  ఒక అంచనా. 

వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్‌ ఆఫ్‌ ది సెంచరీ’’ అంటూ సోషల్‌ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్‌ వెడ్డింగ్‌ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్‌కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్‌ను ప్రైవేట్‌ పార్టీగా బెజోస్‌ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. 

జెఫ్‌ బెజోస్‌ గురించి.. 
జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్‌లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది.  మెకెంజీ స్కాట్‌ను బెజోస్‌ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్‌వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. 

లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55.  ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు.  "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.

లారెన్‌ గతంలో ఎన్‌ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్‌ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్‌ వైట్‌సెల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్‌ బెజోస్‌తో డేటింగ్‌ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. 

ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 
 

1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్‌ డాలర్లు)

2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్‌రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చారు.
 

2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు

2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్‌ సింగర్‌ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు.  ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 

3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు

2018లో ఉదయ్‌పూర్‌లోని రాజమహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 
 

4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు

2004లో ఫ్రాన్స్‌లో వెర్సైల్స్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు.
 

5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు

1981లో ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు.
 

6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు

2018లో విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 
 

7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లు

ఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం.
 

8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు

2011లో వెస్ట్‌మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు
 

9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు

2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్‌లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్‌తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
 

10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లు

బాస్కెట్‌బాల్ చక్రవర్తి మైఖేల్‌ జార్డన్‌ వివాహం క్యూబన్‌ అమెరికా మోడల్‌ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. 

పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్‌ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్‌ ప్యాలెస్‌ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్‌.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్‌ వివాహ వేడుక గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement