breaking news
lavish wedding
-
అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?
ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి గోల ఏంటంటే..అమెరికా టెక్ దిగ్గజం జెఫ్ బెజోస్(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్లో జూన్ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.వెనిస్లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్‌లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా.. విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు. ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని ఒక అంచనా. వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’’ అంటూ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్ను ప్రైవేట్ పార్టీగా బెజోస్ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది. మెకెంజీ స్కాట్‌ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్‌వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్‌తో డేటింగ్ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్ డాలర్లు)2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్‌రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చారు. 2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్ సింగర్ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు. ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు2018లో ఉదయ్‌పూర్‌లోని రాజమహల్లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు2004లో ఫ్రాన్స్‌లో వెర్సైల్స్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు. 5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు1981లో ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు. 6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు2018లో విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లుఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం. 8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు2011లో వెస్ట్‌మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు 9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్‌లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్‌తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లుబాస్కెట్బాల్ చక్రవర్తి మైఖేల్ జార్డన్ వివాహం క్యూబన్ అమెరికా మోడల్ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్ వివాహ వేడుక గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ.790 కోట్లు ఖర్చు
సాక్షి, వెబ్‌డెస్క్: దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పెనవేసుకుపోయింది. రెండు మనసులను.. రెండు కుటుంబాలను.. మూడు ముళ్లతో పెనవేస్తుంది వివాహ బంధం. అందుకే ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోవాలని భావిస్తారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. నిశ్చితార్థం వేడుక నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు ప్రతి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఉవ్విళ్లురతారు. అందుకే తమ తమ స్థాయిలకు తగ్గట్లు.. కొన్ని సార్లు అంతకుమించే ఖర్చు చేస్తారు. అయితే కొన్ని పెళ్లి వేడుకలు ఖర్చు విషయంలో ఏకంగా చరిత్ర సృష్టించాయి. మరి ఆ వేడుకలు ఎక్కడ.. ఎవరింట జరిగాయి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. 1.ప్రిన్సెస్ డయానా-చార్లెస్ వివాహ వేడుక బ్రిటన్ రాజవంశంలోనే కాక.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది డయానా-చార్లెస్‌ల పెళ్లి. 1981లో జరిగిన వీరి వివాహ వేడుక కోసం మొత్తం నగరాన్ని లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. అప్పట్లోనే వీరి పెళ్లి కోసం ఏకంగా 48 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి లెక్కల్లో అది ఏకంగా 100 మిలియన్ డాలర్ల కన్న ఎక్కువ అనగా సుమారు 790 కోట్ల రూపాయలుగా ఉంటుంది. 2. వనిషా మిట్టల్-అమిత్ భాటియా వివాహం ప్రపంచ ఉక్కు రారాజు, ఇంగ్లండ్‌లోనే అత్యంత ధనవంతుడే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్ కుమార్తె వనిషా వివాహానికి ఏకంగా 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 408 కోట్లు) ఖర్చు చేశారు. 2004లో వనిషా-అమిత్ భాటియాల వివాహం పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి 20వ శాతాబ్దపు అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా చరిత్ర సృష్టించింది. 3. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్ల పెళ్లి వేడుక ప్రపంచంలోనే మరో అత్యంత ఖరీదైన వివాహ వేడుక బ్రిటన్ రాజకుటుంబంలోనే జరిగింది. తల్లి డయానా బాటలోనే కుమారుడు ప్రిన్స్ విలియం వివాహం కూడా అత్యంత ఖరీదైన వేడుకగా నిలిచింది. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్లు 29, ఏప్రిల్, 2011న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక కోసం 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే 244 కోట్ల రూపాయలన్నమాట. 4. ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహం ఆసియా కుబేరుడు, భారతదేశపు అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, బాలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి అతిథులుగా హాజరయ్యారు. ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహం 12, డిసెంబర్, 2018 న జరిగింది. తన కుమార్తె వివాహం కోసం అంబానీ 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని వార్తలు వినిపించగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహ వ్యయం 15 మిలియన్ డాలర్లకు మించలేదని (దాదాపు 111 కోట్ల రూపాయలు) తెలిపింది. 5. లిజా మిన్నెల్లి-డేవిడ్ గెస్ట్‌ల వివాహం.. అమెరికన్ గాయని, నటి లిసా 2002 లో ఒక అమెరికన్ టీవీ షో నిర్మాత డేవిడ్ గెస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ తమ వివాహానికి 3.5 మిలియన్ డాలర్లు (రూ .26 కోట్లు) ఖర్చు చేశారు. 6. ఎలిజబెత్ టేలర్-లారీ ఫోర్టెన్స్కీ హాలీవుడ్ ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన ఎలిజబెత్ టేలర్ 1991 లో లారీ ఫోర్టెన్స్కీ అనే భవన నిర్మాణ కార్మికుడిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఎలిజబెత్ స్నేహితుడు, పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్, నెవర్‌ల్యాండ్ రాంచ్లో జరిగింది. వీరి వివాహ వేడుక కోసం 1.5 నుంచి 2 మిలియన్ డాలర్లు (రూ. 11-14 కోట్లు) ఖర్చు చేశారు. అయితే, వివాహం అయిన 5 సంవత్సరాలకే వారు విడాకులు తీసుకున్నారు. -
వధువు లేని పెళ్లి; సమాజాన్ని పట్టించుకోను!
తన కజిన్ పెళ్లి చూసినప్పటి నుంచి తానూ అంతే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు అశోక్ బరోట్ అనే వ్యక్తి. కొడుకు మనసు తెలుసుకున్న అతడి తండ్రి..ఓ మంచి ముహూర్తం చూసి వివాహం జరిపించారు. మెహందీ, సంగీత్‌తో మొదలైన పెళ్లి వేడుకలు గుజరాతీ సంప్రదాయం ప్రకారం పూర్తయ్యాయి. అయితే వైభవోపేతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు లేదనే ఒక్క లోటు తప్ప అన్నీ సవ్యంగానే జరిగాయి. ఈ వింత పెళ్లికి సంబంధించిన వివరాలు.. గుజరాత్‌కు చెందిన అశోక్ బరోట్(27) బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన అశోక్‌కు తండ్రే అన్నీ తానై పెంచాడు. అయితే ఊళ్లో జరిగే పెళ్లి వేడుకలకు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే అశోక్.. తన అన్నయ్య పెళ్లి తర్వాత తనకు కూడా పెళ్లి చేయాలని తండ్రిని కోరాడు. కానీ అతడి కోసం ఎంత వెదికినా వధువు మాత్రం దొరకలేదు. దీంతో కొడుకు బాధ పడకూడదనే ఆలోచనతో పెళ్లి కూతురు లేకపోయినా సరే..అంగరంగ వైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరిపించాడు. సంప్రదాయ పద్ధతిలో శేర్వాణీ ధరించి, మెడలో పూలమాలతో గుర్రంపై ఊరేగింపుగా బయల్దేరిన కొడుకును చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి అశోక్ తండ్రి విష్ణు బరోట్ మాట్లాడుతూ..‘ నా కొడుకు అందరిలాగా చురుకైన వాడు కాదు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం మరో దెబ్బ. బంధువులతో పాటు ఊళ్లో వాళ్ల పెళ్లికి కూడా వెళ్లడం తనకు అలవాటు. అలా వెళ్లొచ్చిన ప్రతీసారి తనకూ పెళ్లి చేయమని అడిగేవాడు. కానీ తనకు వధువు దొరకలేదు. ఈ విషయం గురించి నా కుటుంబ సభ్యులతో చర్చించి నా కొడుకు కలను తీర్చాలని భావించాను. అందుకే పెళ్లి కార్డులు ముద్రించి బంధువులకు పంచాను. ఆ తర్వాత తనను గుర్రంపై ఊరేగించి, బరాత్ నిర్వహించాను. ఇవన్నీ చూసి అశోక్ ఎంతగానో సంతోషించాడు. సుమారు 800 మంది బంధువులు హాజరై తనను ఆశీర్వదించారు. ఈ విషయం గురించి సమాజం ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా కొడుకు సంతోషం కంటే నాకేదీ ఎక్కువ కాదు’ అంటూ తండ్రి ప్రేమ చాటుకున్నారు. -
సింహంపై ఊరేగిన పెళ్లికొడుకు!!
-
సింహంపై ఊరేగిన పెళ్లికొడుకు!!
ముల్తాన్: అదో విలాసవంతమైన పెళ్లి. సింహంపై ఊరేగుతూ పెళ్లికొడుకు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. నమ్మకలేక పోతున్నారా? అయితే పాకిస్తాన్ లోని ముల్తాన్ లో జరిగిన పెళ్లి గురించి తెలుసుకోవాల్సిందే. కోటీశ్వరుడు కొడుకైన షేక్ మహ్మద్ కు కనీవినీ ఎరుగనిరీతిలో పెళ్లి చేసుకోవాలకున్నాడు. మహ్మద్ కోరిక మేరకు అతడి తండ్రి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశాడు. సింహంపై ఎక్కి పెళ్లి మండపానికి రావాలన్న కోరికను వరుడు వ్యక్తం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. మహ్మద్ తండ్రి మాత్రం కొడుకు కోరికను తీర్చేందుకు సిద్ధపడ్డాడు. బోనులో బంధించిన సింహాన్ని తెప్పించాడు. బోనుతో సహా సింహాన్ని జీపు ఎక్కించారు. సింహం ఉన్న బోనుపై కూర్చుని ఊరేగుతూ వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వందలాది మంది లారీల్లో, వీధుల్లో డాన్సులు చేస్తూ వరుడి వెంట ఊరేగింపుగా వెళ్లారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారు. వరుడికి వధువు కుటుంబం రూ. 5 కోట్లు కట్నం ఇచ్చింది. అంతేకాదు పెళ్లికొడుక్కి హోండా కారు, అతడి సోదరులకు మోటారు సైకిళ్లతో పాటు రకరకాల వస్తువులు కానుకలుగా సమర్పించుకుంది. వీటన్నింటినీ పెళ్లి మండపంలో ప్రదర్శించడం విశేషం. ఈ పెళ్లికి 15 వేల మందిపైగా హాజరయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను '24 న్యూస్' అధికారిక యూట్యూబ్ చానల్ లో పెట్టింది. -
ఆ పెళ్లి కోసం 50 చార్టెడ్ విమానాలు
పదివేల మంది అతిథులు హాజరు అందులో అత్యధికమంది వీవీఐపీలే నాగ్‌పూర్‌లో అత్యంత అట్టహాసంగా గడ్కరీ కూతురు పెళ్లి పదివేల మంది అతిథులు. అందులో ఎక్కుమంది వీవీఐపీలే. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రముఖులు.. వారిని నాగ్‌పూర్‌కు తరలించేందుకు 50 ప్రత్యేక చార్టెడ్ విమానాలు. ఇంత అట్టహాసం ఎందుకు అనుకుంటున్నారా! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూతురి పెళ్లి కోసం. ఆదివారం సాయంత్రం నాగ్‌పూర్‌లో అత్యంత అట్టహాసంగా ఈ వివాహం జరగబోతున్నది. రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు అనేకమంది ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, ఎమ్మెన్సెస్ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, హేమామాలిని, వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా తదితర ప్రముఖులు పెళ్లి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. మరో నమ్మశక్యంకాని విషయమేమిటంటే.. ఈ పెళ్లి నేపథ్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో దేశంలో ఎక్కడి నుంచైనా నాగ్‌పూర్ వెళ్లేందుకు విమాన టికెట్లు అందుబాటులోకి లేవట. 2010 డిసెంబర్లో గడ్కరీ పెద్ద కొడుకు పెళ్లి సందర్భంలోనూ నాగ్‌పూర్‌లో ఇదేవిధంగా అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. గడ్కరీకి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు కొడుకులు నిఖిల్, సారంగ్ పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఏకైక కూతురు కేత్కి పెళ్లి నాగ్‌పూర్‌కు చెందిన సంధ్య, రవీంద్ర కస్కేదికర్ దంపతుల కొడుకు ఆదిత్యతో జరుగుతున్నది. వరుడు అమెరికాలోని ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 5 నుంచి జరగనుండటంతో శాసనసభ్యులందరూ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నది. -
ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు
మాస్కో: ఎవరైనా విలాసవంతంగా వివాహం జరిపిస్తే ఆకాశమంత పందిరివేసి, భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా చేశాడంటాం అతిశయోక్తిగా. అదే తరహాలో కజక్‌లో పుట్టి రష్యాలో ప్రపంచ చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిహాయిల్ గుత్సరీవ్ తన 28 కుమారుడి పెళ్లిని అంతకంటే వైభవోపేతంగా జరిపించారు. మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్, సఫియా బాంక్వెట్ హాల్లో పుష్పాలంకృత భారీ వేదికపై శనివారం జరిగిన ఈ పెళ్లికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది ఓ అంచనా. వజ్రాలు పొదిగిన పెళ్లి కూతురు శ్వేతవర్ణపు వెడ్డింగ్ డ్రెస్కే 16.20 లక్షల రూపాయలట. ప్రముఖ డిజైనర్ నేసిన దీన్ని పారిస్ నుంచి తెప్పించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 28 ఏళ్ల గుత్సరీవ్, 20 ఏళ్ల విద్యార్థి ఖదీజా ఉజకోవ్లు పెళ్లి చేసుకున్నారు. జెన్నీఫర్ లోపెజ్, ఎన్రిగ్ ఇగ్లేసియాస్ లాంటి సెలబ్రిటీలు ఆహుతులను అలరించారు. ఇంతవైభవంగా పెళ్లి జరిపించిన చమురు దిగ్గజం మిహాయిల్కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.