అంగరంగ వైభవంగా పెళ్లి.. వధువు మాత్రమే లేదు!

Gujarat Man Lavish Wedding Without Bride - Sakshi

తన కజిన్‌ పెళ్లి చూసినప్పటి నుంచి తానూ అంతే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు అశోక్‌ బరోట్ అనే వ్యక్తి. కొడుకు మనసు తెలుసుకున్న అతడి తండ్రి..ఓ మంచి ముహూర్తం చూసి వివాహం జరిపించారు.  మెహందీ, సంగీత్‌తో మొదలైన పెళ్లి వేడుకలు గుజరాతీ సంప్రదాయం ప్రకారం పూర్తయ్యాయి. అయితే వైభవోపేతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు లేదనే ఒక్క లోటు తప్ప అన్నీ సవ్యంగానే జరిగాయి. ఈ వింత పెళ్లికి సంబంధించిన వివరాలు..

గుజరాత్‌కు చెందిన అశోక్‌ బరోట్‌(27) బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన అశోక్‌కు తండ్రే అన్నీ తానై పెంచాడు. అయితే ఊళ్లో జరిగే పెళ్లి వేడుకలకు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే అశోక్‌.. తన అన్నయ్య పెళ్లి తర్వాత తనకు కూడా పెళ్లి చేయాలని తండ్రిని కోరాడు. కానీ అతడి కోసం ఎంత వెదికినా వధువు మాత్రం దొరకలేదు. దీంతో కొడుకు బాధ పడకూడదనే ఆలోచనతో పెళ్లి కూతురు లేకపోయినా సరే..అంగరంగ వైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరిపించాడు. సంప్రదాయ పద్ధతిలో శేర్వాణీ ధరించి, మెడలో పూలమాలతో గుర్రంపై ఊరేగింపుగా బయల్దేరిన కొడుకును చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నాడు.

ఈ విషయం గురించి అశోక్‌ తండ్రి విష్ణు బరోట్‌ మాట్లాడుతూ..‘ నా కొడుకు అందరిలాగా చురుకైన వాడు కాదు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం మరో దెబ్బ. బంధువులతో పాటు ఊళ్లో వాళ్ల పెళ్లికి కూడా వెళ్లడం తనకు అలవాటు. అలా వెళ్లొచ్చిన ప్రతీసారి తనకూ పెళ్లి చేయమని అడిగేవాడు. కానీ తనకు వధువు దొరకలేదు. ఈ విషయం గురించి నా కుటుంబ సభ్యులతో చర్చించి నా కొడుకు కలను తీర్చాలని భావించాను. అందుకే పెళ్లి కార్డులు ముద్రించి బంధువులకు పంచాను. ఆ తర్వాత తనను గుర్రంపై ఊరేగించి, బరాత్‌ నిర్వహించాను. ఇవన్నీ చూసి అశోక్‌ ఎంతగానో సంతోషించాడు. సుమారు 800 మంది బంధువులు హాజరై తనను ఆశీర్వదించారు. ఈ విషయం గురించి సమాజం ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా కొడుకు సంతోషం కంటే నాకేదీ ఎక్కువ కాదు’ అంటూ తండ్రి ప్రేమ చాటుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top