మోదీ మొండిఘటం | USA President Donald Trump has praised Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ మొండిఘటం

Jun 21 2026 4:35 AM | Updated on Jun 21 2026 5:07 AM

USA President Donald Trump has praised Prime Minister Narendra Modi

ఆయనో గొప్ప నేత

అందుకే పుష్కరకాలంగా పదవిలో ఉన్నారు

ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసల జల్లు

వాషింగ్టన్‌: ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే మొండిఘటం మోదీ అంటూ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ ప్రధాని మోదీని పొగిడిన మూడ్రోజులకే మరోసారి మోదీని ట్రంప్‌ పొగడటం విశేషం. శనివారం యాక్సియస్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనను ట్రంప్‌ కొనియాడారు. 

‘‘ మోదీ ఎంతో మంచి వ్యక్తి. అది నిజం. ఎన్నో అంశాల్లో మోదీ మెరుగ్గా ఉన్నారు. యుద్ధాలను దూరంగా ఉన్నారు. అది నిజంగా తెలివైన నిర్ణయం. ఆయనకు ఏకంగా 150 కోట్ల మంది జనం అండగా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది మద్దతుతో బడానేతగా ఎదిగారు. వాస్తవానికి భారత్‌ అతిపెద్దది. మోదీ గొప్ప నాయకుడు. భారత్‌తో మేం పెద్ద మొత్తంతో వాణిజ్యకార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. గతంలో భారత్‌ మాతో తక్కువ వ్యాపారం చేసేది. ఇప్పుడు మరింతగా, అత్యంత పారదర్శకంగా వాణిజ్యం జరుపుతున్నాం’’ అని అన్నారు. 

అధికారం, మధ్యవర్తిత్వం, దౌత్యం నెరిపే ఒడుపు, సత్ఫలితాలను సాధించే సత్తా ఉన్న ఇద్దరు గొప్ప నేతల పేర్లు చెప్పండి అని యాక్సియస్‌ సంస్థ ప్రతినిధి అడగ్గా.. ‘‘అధికారం, అవతలి దేశాన్ని ప్రభావితంచేసే శక్తియుక్తులు, తాము అనుకున్నది రాబట్టే సత్తా విషయంలో నాకు మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నచ్చు తారు. వీళ్ల ఇద్దరి ఘనతను చాటేలా ఒక సినిమా తీయాలంటే మాత్రం అచ్చం వీళ్లలా వేషభాషలు, హావభావాలు పలికించే అద్భు త నటుడు హాలీవుడ్‌లో లేనేలేడు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘‘మోదీ అంటే నాకెంతో గౌరవం. పైకి ఎంతో సౌమ్యంగా మాట్లాడే మోదీ నిజానికి ఎంతో ఘటికుడు. అనుకున్న ది సాధించేదిదాకా వదలరు. 

గతంలో ఆయ న గురించి నాకు అంతగా తెలియదు. తర్వా త తెల్సుకున్నా’’ అని అన్నారు. ‘‘భారత్‌ను దశాబ్దాలుగా గమనిస్తున్నా. అప్పట్లో భారత్‌ లో ప్రభుత్వాలు వెనువెంటనే మారిపోయేవి. ఆరు నెలలు, ఏడాదికే ప్రధాని మారిన సందర్భాలున్నాయి. ఇదంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ మార్పులు మోదీ చరమగీతం పాడారు. ఆయన వచ్చాక 12 ఏళ్లుగా ఆయనే పరిపాలిస్తున్నా. స్థిరమైన పాలన చూపించారు. చూడ్డానికి ఎంతో శాంతంగా కన్పిస్తారు. కానీ ఆయన దృఢమైన వ్యక్తి’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంటే కూడా తనకు ఇష్టమని ట్రంప్‌ తెలిపారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement