కాలిఫోర్నియాలో నిరసనల టెన్షన్‌.. ట్రంప్‌ హెచ్చరికలు | USA Donald Trump Alert To Los Angeles immigration Protest Issue | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో నిరసనల టెన్షన్‌.. ట్రంప్‌ హెచ్చరికలు

Jun 8 2025 11:13 AM | Updated on Jun 8 2025 11:28 AM

USA Donald Trump Alert To Los Angeles immigration Protest Issue

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ వలసదారుల అరెస్ట్‌ల నేపథ్యంలో వందలమంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి.. ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో నిరసన కారులకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ సందర్భంగా నిరసనలపై ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్‌ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తాం. అక్రమ వలసదారులు నిరసనలు చేయడం సరైన పద్దతి కాదు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్‌ అధికారులు లాస్‌ ఏంజెలెస్‌లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. సుమారు 1000 మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం.. నిరసనకారులను చెదరగొట్టేందకు పోలీసులు.. లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

మరోవైపు.. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్‌ భవనం వెలుపలకు చేరుకొని ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్‌ అధికారులు పెప్పర్‌ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement