
సాక్షి, హైదరాబాద్: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందన్నారు. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని ఆశించారు.
‘సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.
కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్‌డేగా ప్రకటించారు. జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మగౌరవ పోరాటం ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి. ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాం. తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి’ అని తెలిపారు