
ఎస్‌ఐఆర్‌పై తక్షణమే చర్చించాలని విపక్షాల డిమాండ్
కోర్టు పరిధిలోని అంశాలపై చర్చించలేమన్న కేంద్రం
ఉభయ సభలు గురువారానికి ఆయిదా
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుధవారం నిలదీశాయి. నిరసన వ్యక్తంచేశాయి. వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు.
దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని స్పీకర్‌స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలు యథాతథంగా కొనసాగాయి. చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. అంతకుముందు లోక్‌సభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.
ఎస్‌ఐఆర్‌పై చర్చించే ప్రసక్తే లేదు: రిజిజు
ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో చర్చించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఆయన బుధవారం సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. అందుకే సభలో చర్చించలేమని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించేందుకు పార్లమెంట్ నియమ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. అలాగే స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కార్యకలాపాల గురించి సభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు.
రాజ్యసభలోనూ అదే అలజడి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఎగవ సభలోనూ అలజడి కొనసాగింది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఎస్‌ఐఆర్‌పై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రూల్ 267 కింద 35 నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభలో నినాదాలు, నిరసనలు మిన్నంటాయి. సభను హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు కొనసాగించారు.
ఒకవైపు గందరగోళం కొనసాగుతుండగానే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్‌కు సంబంధించిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను సభలో ప్రవేశపెట్టారు. తర్వాత ‘క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు–2025’మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో స్వల్ప చర్చ జరిగింది. మరోవైపు విపక్షాలు ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ చైర్మన్ పోడియంపైకి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా వెల్లడించారు.