
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏదో వివాదంలో ఎనిమిదో తరగతి.. విద్యార్థి పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడవగా, బాధిత విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం బయటకు పొక్కినంతనే ప్రజాగ్రహం పెల్లుబికి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆగ్రహంతో రగిలిపోతూ కొందరు ఆందోళనకారులు పాఠశాలను ధ్వంసం చేశారు.
మణినగర్ ఈస్ట్‌లోని సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చి స్కూల్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆ విద్యార్థి మరణించాడు. అనంతరం బాధిత కుటుంబంతో పాటు సింధీ వర్గానికి చెందినవారంతా ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన నిరసనకారులు పాఠశాల సిబ్బందిపై దాడి చేశారు. సమీపంలో పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులతో పాఠశాల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పాఠశాల వెలుపల రోడ్డును దిగ్బంధించారు.
మణినగర్ ఎమ్మెల్యే, డీపీపీ బల్దేవ్ దేశాయ్, ఏసీపీ పరిస్థితిని చక్కదిద్దడాని ప్రయత్నించారు. బజరంగ్ దళ్, బీహెచ్‌పీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.