భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌  | USA Approves Support Package for India Apaches and M777 Systems | Sakshi
Sakshi News home page

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

Jun 23 2026 5:51 AM | Updated on Jun 23 2026 5:54 AM

USA Approves Support Package for India Apaches and M777 Systems

ఉపకరణాలు, సేవల ఒప్పందాన్ని నోటిఫై చేసిన అమెరికా

వాషింగ్టన్‌: భారత్‌కు విక్రయిస్తున్న అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అత్యంత తేలికైన శతఘ్నుల్లో ఉపయోగించే ఉపకరణాలు, వాటి సర్వీసింగ్‌కు సంబంధించిన 482.2 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.4,561కోట్ల) విలువైన ఒప్పందాన్ని అమెరికా లాంఛనంగా నోటిఫై చేసింది. లాంఛనంగా నోటిఫై చేసిన ఈ వివరాలను విదేశీ సైనిక కొనుగోళ్ల ప్రాజెక్టులను చూసుకునే అమెరికా భద్రతా సహకార ఏజెన్సీ(డీఎస్‌సీఏ) జూన్‌ 17వ తేదీన తన ఫెడరల్‌ రిజిస్టర్‌లో పొందుపరిచింది. 

అంతకుముందే మే 18వ తేదీన అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 హవిట్జర్‌ల సర్వీసింగ్‌ సేవల అమ్మకంపై అమెరికా కాంగ్రెస్‌కు ఆ దేశ విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. పర్వతమయ సరిహద్దుల్లో శత్రుసేనల పీచమణిచేందుకు భారత్‌ విదేశీ సైనిక కొనుగోళ్ల మార్గంలో అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు, శతఘ్నులను కొనుగోలుచేయడం తెల్సిందే. ఇవిగాక ఏహెచ్‌–64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లనూ భారత్‌ ప్రస్తుతం వినియోగిస్తోంది. 

ఈరకం ప్రపంచంలోనే అత్యుత్తమమైన యుద్ధహెలికాప్టర్‌లలో ఒకటి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడంతోపాటు యుద్ధక్షేత్రాల్లో సైన్యానికి సైనిక, ఆయుధ సరఫరాలో ఎంతగానో సాయపడుతుంది. తాజాగా నోటిఫై అయిన ఒప్పందం ప్రకారం ఎం777ఏ2 శతఘ్నుల సేవల ఒప్పందాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని భారత్‌ భావిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఆయుధాల విడిభాగాల అందజేత, మరమ్మత్తు, పాడైనవి మార్చేసి కొత్తవి బిగించడం, వాటిని ఉపయోగించే సిబ్బందికి శిక్షణ, ఇతర సాంకేతిక తోడ్పాటును భారత దళాలకు అమెరికా అందించనుంది. 

శతఘ్నులకు సంబంధించి 230 మిలియన్‌ డాలర్లు, అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి 198.2 మిలియన్‌ డాలర్లు మొత్తంగా 482.2 మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాస్తవానికి అపాచీ సపోర్ట్‌ సర్వీసుల ప్రధాన కాంట్రాక్ట్‌ బోయింగ్‌ కంపెనీ, లాక్‌హీడ్‌ మార్టీన్‌లతో భారత్‌ గతంలో కుదుర్చుకుంది. శతఘ్నులకు సంబంధించి బ్రిటన్‌లోని కంబ్రియాలోని బీఏఈ సిస్టమ్స్‌తో భారత్‌ ప్రధాన సర్వీస్‌ కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది. 

ఇప్పుడు కొత్తగా సహాయక సేవల అమ్మకం ఒప్పందాన్ని అమెరికాతో భారత్‌ కుదుర్చుకుంది. అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే ఉద్దేశంతోనే సేవల అమ్మకాన్ని ముందుకొచ్చామని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఎప్పటికప్పుడు రిపేర్లు, కొత్త విడిభాగాల బిగింపుతో ఆయుధాల సన్నద్ధత పెరిగి రక్షణ భాగస్వామ్య దేశమైన భారత్‌లో భద్రత మరింత పటిష్టమవుతుంది. ఇది ఇండోపసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిరత, శాంతి, ఆర్థికాభివృద్ధికి బాటలుపరుస్తుంది’’అని అమెరికా పేర్కొంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement