చైనాపై సుంకాలు 245% | US slaps 245percent retaliatory tariffs on Chinese goods as trade war | Sakshi
Sakshi News home page

చైనాపై సుంకాలు 245%

Apr 17 2025 5:25 AM | Updated on Apr 17 2025 5:25 AM

US slaps 245percent retaliatory tariffs on Chinese goods as trade war

బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసినందుకు అమెరికా ప్రతీకారం 

టారిఫ్‌ వార్‌ను ముగించే విషయంలో బంతి చైనా కోర్టులోనే ఉంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టీకరణ 

అమెరికాతో చర్చల కోసం నూతన ప్రతినిధిని నియమించిన చైనా 

వాషింగ్టన్‌/బీజింగ్‌: ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. బోయింగ్‌ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఫ్యాక్టషీట్‌ విడుదల చేసింది. 

అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడడం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అమెరికా ఫస్ట్‌ ట్రేడ్‌ పాలసీ’ని మొదటి రోజే ప్రారంభించారని గుర్తుచేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది.

 చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్‌షీట్‌లో స్పష్టంచేసింది. చైనా–అమెరికా మధ్య కొంతకాలంగా టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్ప త్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు విధించింది. అమెరికా నుంచి బోయింగ్‌ విమానాల కొనుగోలుపై నిషేధం విధించిన మరుసటి రోజే టారిఫ్‌లను అదనంగా 100 శాతం పెంచడం గమనార్హం. 

బోయింగ్‌ విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా నిర్ణయించడం పట్ల డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవడం సరైంది కాదంటూ మంగళవారం సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు కచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్‌ వార్‌ను ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని వెల్లడించారు.

చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్‌ నియామకం 
టారిఫ్‌ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోర్టులో ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గుచూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్‌ను నియమించింది. వాంగ్‌ షౌవెన్‌ స్థానంలో లీ చెంగాంగ్‌ను నియమిస్తున్నట్ల చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది. 2020లో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్‌ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా రాయబారిగా సేవలందించారు.   

Advertisement
 
Advertisement
Advertisement