
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజు కొనసాగుతోంది. యుద్ధం తీవ్రతరం కావొచ్చని.. పశ్చిమాసియా నుంచి ఈ ఉద్రిక్తతలు మిగతా ప్రపంచానికి విస్తరించవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటలను, చేష్టలను, చర్యలను అన్వయించుకుంటున్నారు. అయితే..
ట్రంప్ మాత్రం ఊహకందని రీతిలో స్పందిస్తున్నారు. జీ7 సదస్సు నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయల్దేరే ముందు తాను కాల్పుల విరమణ కోసం ప్రయత్నించడం లేదని.. అంతకు మించి ఉత్తమమైన మార్గం కోసం ప్రయత్నిస్తున్నానని మీడియా ప్రతినిధులతో అన్నారు. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కోసం ప్రయత్నిస్తున్నాం. అది నిజమైన ముగింపుగా ఉండనుంది అని ట్రంప్ పేర్కొన్నట్లు బీబీసీ ఒక కథనం ప్రచురించింది.
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించడంపై ట్రంప్‌కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారాయన. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయన్న ట్రంప్.. రాబోయే రెండు రోజుల్లో మీరే చూస్తారని, అప్పటిదాకా ఎవరూ వెనక్కి తగ్గకపోవచ్చని సీబీఎస్ జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్య చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలను బట్టి అమెరికా నుంచి దౌత్య వేత్తలను ఇరాన్‌తో చర్చలకు పంపించవచ్చని రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదంటే పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్‌లలో ఎవరో ఒకరిని పంపొచ్చని ఆ కథనం ఉటంకించింది.
ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట జూన్ 13వ తేదీ నుంచి దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో ఒకవైపు ఇరుదేశాల్లో ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చమురు మార్కెట్ కుదేలు అవుతోంది. ఈ క్రమంలో..
జీ7 సదస్సును కుదించుకుని మరీ హడావిడిగా వాషింగ్టన్ బయల్దేరారు అధ్యక్షుడు ట్రంప్. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదన చేశారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. కాసేపటికే అందులో వాస్తవం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. జరగబోయేది మేక్రాన్‌కు తెలియదని.. అది కాల్పుల విరమణకు మించే ఉంటుందని ట్రంప్ సోషల్ ట్రూత్ వేదికగా ప్రకటించారు.
న్యూక్లియర్ ఎలాంటి అణ్వాయుధాలను కలిగి ఉండడానికి వీల్లేదంటున్న ట్రంప్.. టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈలోపు.. ఆయన సిట్యుయేషన్ రూమ్‌లో జాతీయ భద్రతా మండలితో భేటీ అవుతుండడంతో ‘ఏదో జరగబోతోందంటూ’ చర్చ నడుస్తోంది.
ఇదీ చదవండి: టైం లేదు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ