యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్‌! | US Iran deal nears as war end looks closer | Sakshi
Sakshi News home page

యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్‌!

Jun 13 2026 7:09 AM | Updated on Jun 13 2026 10:28 AM

US Iran deal nears as war end looks closer

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్‌ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్‌ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్‌.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది.  ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్‌ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్‌ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఖ్చీ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ..  చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదికలో షేర్‌ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చారు.

ఇరాన్‌ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్‌ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్‌ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అదే కీలకం
ఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్‌ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్‌ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్‌పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అణు ఒప్పందం.. ఆగాల్సిందే!
అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్‌ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్‌ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్‌బ్లెండింగ్‌) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్‌ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.

ఇది ఇంకో ట్విస్ట్‌
ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్‌ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్‌.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి  బెంజమిన్‌ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలుగుతుందని ఇరాన్‌ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్‌ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement