అరవై రోజుల్లో తుది ఒప్పందం?  | United States and Iran have signed a 60-day ceasefire roadmap | Sakshi
Sakshi News home page

అరవై రోజుల్లో తుది ఒప్పందం? 

Jun 23 2026 5:13 AM | Updated on Jun 23 2026 5:13 AM

United States and Iran have signed a 60-day ceasefire roadmap

ఒబ్యూర్‌జెన్‌: పశ్చిమాసియాలో యుద్ధ విరమణకు రంగం సిద్ధమైంది. ఇరాన్, అమెరికాల మధ్య స్విట్జర్లాండ్‌లోని ఒబ్యూర్‌జెన్‌ రిసార్ట్‌లో జరుగుతున్న ఉన్నత స్థాయి శాంతి చర్చలు ముగిశాయి. యుద్ధానికి శాశ్వత విరామం ప్రకటించేందుకు వీలుగా అరవై రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ఒకటి సిద్ధం చేయాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లు ప్రకటించాయి. మరోవైపు సాంకేతిక అంశాలపై ఏకాభిప్రాయానికి ఇరుపక్షాలు ఈ వారం పొడవునా చర్చలు కొనసాగించనున్నట్లు సమాచారం.

 చర్చలు ఫలవంతమయ్యాయని ఇరాన్, పాకిస్థాన్, ఖతార్‌లు ప్రకటించగా అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.  ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’తో ఇరాన్‌పై విరుచుకుపడటంతో మొదలైన యుద్ధం అంతకంతకూ తీవ్రమైన విషయం తెలిసిందే. ప్రతిక్రియగా ఇరాన్‌ ప్రపంచ చమురు సరఫరా మార్గం హర్మూజ్‌ను మూసివేయడం... ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా మిత్రపక్షాలుగా భావిస్తున్న సౌదీ అరేబియా, దుబాయి, ఖతార్‌లపై దాడులకు దిగింది. 

నాలుగునెలల కాలంలో శాంతి కోసం పలు దఫాలుగా చర్చలు జరిగినా సాధించింది పెద్దగా లేదు. ఒప్పందానికి వచ్చి తీరాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రస్థాయి హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం స్విట్జర్లాండ్‌లో మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఇరుదేశాలు ఒక అంగీకారానికి        వచ్చినట్లు పాక్, ఖతార్‌లు ప్రకటించడంతో యుద్ధం ముగిసే అవకాశాలు మెరుగయ్యాయి.  లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను నియంత్రించేందుకు ఆ దేశ ప్రభుత్వం భాగస్వామ్యంతో ‘డి–కాన్‌ఫ్లిక్షన్‌ సెల్‌’ఒకదాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్‌లు అంగీకరించాయి. 

అలాగే హెజ్బోల్లా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు పాల్పడకుండా కూడా ఈ సెల్‌ పర్యవేక్షిస్తుంది. స్ట్రెయిట్‌ ఆఫ్‌ హర్మూజ్‌ గుండా చమురు రవాణా సాఫీగా జరిగిందుకు వీలుగా ప్రత్యేకమైన కమ్యూనికేషన్‌ లైన్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే తుది ఒప్పందాన్ని సిద్ధం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అరవై రోజుల్లో ఇది పూర్తవుతుందని అంచనా. అయితే ఇరాన్‌ మద్దతున్న హెజ్బొల్లా, ఇజ్రాయెల్‌లు ఘర్షణలు నిలిపివేస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తర ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై దాడులు చేస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాదులను నియంత్రించే స్వేచ్ఛ తమకు ఉండాలని ఇజ్రాయెల్‌ పట్టుబడుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement