12 వేల కోట్ల ‘పుతిన్ ప్యాలెస్’ రక్షణ వలయంపై ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం! | Ukrainian Drones Strike Air Defence System Guarding Vladimir Putin’s Black Sea Residence | Sakshi
Sakshi News home page

12 వేల కోట్ల ‘పుతిన్ ప్యాలెస్’ రక్షణ వలయంపై ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం!

Aug 13 2026 1:01 AM | Updated on Aug 13 2026 1:29 AM

Ukrainian Drones Strike Air Defence System Guarding Vladimir Putin’s Black Sea Residence

మాస్కో: నల్లసముద్ర తీరంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన రహస్య ప్యాలెస్‌కు రక్షణగా నిలిచిన అత్యాధునిక ‘ఎస్-400’ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి.

దక్షిణ రష్యాలోని గెలెంజిక్  సమీపంలో ఉన్న పుతిన్ భారీ ప్యాలెస్‌కు దాదాపు 12 మైళ్ల దూరంలో ఈ ఎస్-400 ‘ట్రయంఫ్’ లాంచర్‌ను రష్యా మోహరించింది. విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల దాడుల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థపై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడి అనంతరం లాంచర్ దాదాపు మూడు గంటల పాటు మంటల్లో కాలిపోయిందని ఉక్రెయిన్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ దళాల కమాండర్ మేజర్ రాబర్ట్ బ్రోవ్డీ వెల్లడించినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది.

వాస్తవానికి ఈ ఎస్-400 వ్యవస్థ 27 చదరపు మైళ్ల విమానాల రాకపోకలు నిషేధించిన ప్రాంతం పుతిన్ నివాస భద్రతా వలయంలో భాగంగా ఉంది. అయితే, ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడేందుకు రష్యా ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను  దాడి చేసేందుకు అనువుగా మార్చిందని, ఆగస్టు 8న దీని నుంచే ఆరు క్షిపణులను ప్రయోగించిందని బ్రోవ్డీ ఆరోపించారు. రష్యా వద్ద వ్యూహాత్మక క్షిపణుల కొరత ఏర్పడటంతో ఇలాంటి రక్షణ వ్యవస్థలను కూడా దాడుల కోసం వాడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

రూ. 12 వేల కోట్ల 'పుతిన్ ప్యాలెస్'
దాడి జరిగిన ప్రదేశం ‘పుతిన్ ప్యాలెస్’గా పిలిచే భారీ ఇటాలియన్ శైలి భవన సముదాయానికి సమీపంలో ఉంది. ఈ ఎస్టేట్ విలువ దాదాపు రూ. 12,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2021లో దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ నేతృత్వంలోని యాంటీ-కరప్షన్ ఫౌండేషన్ ఈ ప్యాలెస్‌కు సంబంధించిన విలాసాలను బయటపెట్టింది. ఈ ఎస్టేట్‌లో క్యాసినో, వైన్‌యార్డ్, స్పా, ఐస్ రింక్, థియేటర్, పోల్-డ్యాన్సింగ్ రూమ్, హుక్కా లాంజ్, అక్వాటిక్ డిస్కోతో పాటు చిన్న రైళ్ల కోసం ప్రత్యేక గది కూడా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్ దాడుల ముప్పు పెరగడంతో పుతిన్ ప్రస్తుతం ఈ నల్లసముద్ర నివాసానికి చాలా అరుదుగా వస్తున్నారని, మాస్కోకు తూర్పున ఉన్న వాల్డాయ్ సరస్సు వద్ద గల కట్టుదిట్టమైన డాచా (విశ్రాంతి భవనం)లోనే ఎక్కువగా గడుపుతున్నారని సమాచారం.

రష్యా లోపలికి చొచ్చుకెళ్తున్న ఉక్రెయిన్ డ్రోన్లు
ఇటీవలి కాలంలో రష్యా సైనిక, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులను విస్తరించింది. ఆక్రమిత క్రిమియాలో రెండు ఎస్-400 లాంచర్లను, ఓరియన్ డ్రోన్ల కంట్రోల్ యాంటెన్నాను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ తెలిపింది. మరోవైపు రష్యాలోని టాటర్‌స్తాన్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై 450కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో 13 మంది మరణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భూభాగంలో జరిగిన అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. సైబీరియాలోని త్యుమెన్ వరకు డ్రోన్ శకలాలు పడినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement