వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్ | Trump to visit India early next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్

Jun 27 2026 11:55 AM | Updated on Jun 27 2026 12:03 PM

Trump to visit India early next year
  • భారత్, అమెరికా బంధంలో నూతన అధ్యాయం
  • ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య సాన్నిహిత్యం అద్భుతం
  • యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

వాషింగ్టన్‌: భారత్, అమెరికా బంధంలో మరో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం అత్యంత అద్భుతమైనదని కొనియాడిన రూబియో.. ఇరు దేశాల దౌత్య సంబంధాలు ‘ఫెంటాస్టిక్’ అంటూ అభివర్ణించారు. వాషింగ్టన్ డీసీలో ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, ఈ మెగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తాను ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

ఫైనల్ స్టేజ్‌లో ట్రేడ్ డీల్
ట్రంప్ పర్యటన కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, దీని వెనుక భారీ వాణిజ్య వ్యూహం దాగి ఉంది. గత 16 నెలల్లో మొదటిసారిగా ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 (G7) సమ్మిట్ వేదికగా మోదీ, ట్రంప్ ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని రూబియో పేర్కొన్నారు. ‘మేం ట్రేడ్ డీల్‌ను పూర్తి చేసేందుకు కేవలం అంగుళాల దూరంలో ఉన్నాం, ఇది చాలా సానుకూల పరిణామం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం పూర్తయితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులు రానున్నాయి.

మోదీపై రూబియో ప్రశంసలు
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మార్కో రూబియో ఆకాశానికెత్తారు. తాను మోదీకి పెద్ద ‘ఫ్యాన్’ అని చెబుతూ, అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను మోదీ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ‘మోదీ భారతదేశాన్ని ఒక గ్లోబల్ పవర్‌గా (ప్రపంచ శక్తిగా) మార్చారు’ అని రూబియో వ్యాఖ్యానించారు. అలాగే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన ‘క్వాడ్’ (Quad) కూటమి తదుపరి సమావేశం కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎనర్జీ సెక్టార్‌లో మెగా పార్ట్‌నర్‌షిప్
ఇక ఇంధన రంగం పరంగా భారత్ ప్రాధాన్యతను అమెరికా ప్రత్యేకంగా గుర్తించింది. ఇంధన సరఫరాను మరింత పెంచేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని రూబియో తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత భారీ క్రూడ్ ఆయిల్ (Heavy Crude)ను శుద్ధి చేసే అరుదైన సాంకేతిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన ప్రశంసించారు. ఒకవేళ వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌కు వస్తే, 2020 ఫిబ్రవరి తర్వాత ఆయనకు ఇదే మొదటి భారత పర్యటన అవుతుంది. అలాగే రెండోసారి వైట్ హౌస్‌ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి విజిట్ కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement