
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డెమోక్రటిక్ పార్టీ బరిలో నిలిచిన ఉపాధ్యక్షురాలు, ఇండియన్ అమెరికన్ అభ్యర్థి కమలా హారిస్‌పై విమర్శల స్థాయిని పెంచారు. అసలు కమలా హారిస్ భారతీయురాలా? లేదా నల్లజాతీయురాలా? అని ప్రశ్నించారు. తాజాగా కమలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ చికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ సమావేశంలో మాట్లాడారు.
‘‘ కమలా ఎప్పుడూ భారతీయ వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. దానినే ఆమె ప్రచారం చేస్తారు.అయితే ప్రస్తుతం ఆమె నల్లజాతీయురాలిగా గుర్తించబడాలని కోరుకుంటున్నారు. నాకు మాత్రం ఆమె భారతీయురాలా? లేదా నల్లజాతీయురాలా? అనే విషయం తెలిదు. నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ఆమె అలా చేయరు. ఎందుకంటే ఆమె ఒక భారతీయురాలుగా ఉండి అకస్మాత్తుగా నల్లజాతీయురాలుగా మారారు’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ చేసిన విమర్శలన అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ తన వ్యాఖ్యలతో కమలా హారిస్‌ను అవమానపరిచారని మండిపడ్డారు. ‘ఎదుటివాళ్ల గుర్తింపును ప్రశ్నించే హక్కు ఎవరీకి లేదు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అన్నారు.