ప్రయాణికుల విమానానికి దగ్గరగా వచి్చన ట్రంప్ సైనిక హెలికాప్టర్
క్షణాల్లో అప్రమత్తమై మళ్లించిన పైలట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెను ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ నేషనల్ విమానాశ్రయం నుంచి ఆయనను తీసుకెళ్తున్న సైనిక హెలికాప్టర్ ‘మెరైన్ వన్’, ఫ్లోరిడాలోని పెన్సకోలాకు బయలుదేరుతున్న ‘ఎన్వాయ్ ఎయిర్’ప్రయాణికుల విమానానికి అతి దగ్గరగా వచ్చింది. కొన్ని క్షణాల తరువాత రెండు విమానాలు వెంటనే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్‌ఏఏ), నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) దర్యాప్తు ప్రారంభించాయి.
మంగళవారం మధ్యా హ్నం రెండు విమానాల మధ్య కొన్నిక్షణాల పాటు దగ్గరగా వచ్చాయని, వెంటనే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయని, అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎఫ్‌ఏఏ పేర్కొంది. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా మరో విమానాన్ని కూడా దారి మళ్లించామని తెలిపింది. రెండు విమానాల మధ్య దూరం తగ్గిన సమయంలో ఏటీసీ ఇద్దరు పైలట్లతో సంప్రదింపులు జరిపిందని పేర్కొంది. ఈ సంఘటన కట్టుదిట్టమైన నియంత్రణలో ఉండే వాషింగ్టన్ గగనతలంలో విమాన భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది.
అధ్యక్షుడు ట్రంప్ స్థానిక సమయం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మెరైన్ వన్ హెలికాప్టర్‌లో వైట్ హౌస్ నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వెళ్తున్నారు. సమాచార లోపంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమీపంలోని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో ఆలస్యం అయ్యింది. దీంతో అధ్యక్ష హెలికాప్టర్, ఎన్వాయ్ ఎయిర్ జెట్‌కు ఒక మైలు కంటే తక్కువ దూరం వచ్చింది.
హెలికాప్టర్ మూడు నిమిషాల్లో గాల్లోకి లేస్తుందని కంట్రోలర్లకు తెలియజేయడానికి మెరైన్ వన్ సిబ్బంది మూడుసార్లు ప్రయతి్నంచింది. కానీ ఆ సమాచారం వారికి చేరడంలో ఆలస్యం అయింది. హెలికాప్టర్ సిబ్బంది కంట్రోల్ టవర్‌ను ముందే హెచ్చరించినట్లు ఏటీసీ ఆడియో సమీక్షలో రికార్డయ్యింది. ఆ తర్వాత, హెలికాప్టర్ బయలుదేరుతున్నట్లు సిబ్బంది ప్రకటించింది. అయితే, అప్పటికే ప్యాసింజర్ జెట్ టేకాఫ్ ప్రారంభించింది.
విమానాశ్రయానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్న వైట్ హౌస్ నుంచి అధ్యక్షుడి హెలికాప్టర్ టేకాఫ్ అయినప్పుడు, సాధారణ విమానాలు బయలుదేరడాన్ని నిలిపివేస్తారు. అయితే, మెరైన్ వన్ ప్రయాణం సాధారణమైనదేనని భావించిన వాషింగ్టన్ నేషనల్ టవర్, హెలికాప్టర్ సిబ్బందిని ఆలస్యం చేయలేదు. ఆగమని అడగలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపలేదు. మెరైన్ వన్ విమానాలను ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన నిపుణులలో కొందరు నడుపుతారు. ఇంతవరకూ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాలకు ప్రమాదం జరగలేదు. దీంతో, ఈ ఘటనపై సమీక్షను కొనసాగిస్తామని, అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపడతామని ఎఫ్‌ఏఏ తెలిపింది. ఎన్‌టీఎస్‌బీ ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది.


