ఎలాన్ మస్క్‌తో డొనాల్డ్ ట్రంప్ సంబంధాలు మళ్లీ మెరగవుతున్నాయా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మస్క్ వ్యాపారాల గురించి మాట్లాడిన ట్రంప్.. ఆయన వెంట తాను ఉన్నానంటూ అభయం ఇచ్చారు. దానికి మస్క్ బదులిచ్చిన తీరు నెట్టింట చర్చకు దారి తీసింది.
అమెరికా-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన పన్ను రాయితీ గురించి వివరించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు లాభదాయకంగా ఉందని.. కారు కొనుగోలు చేసే వారికి ఇంత రాయితీ ఎప్పుడూ లేదని అన్నారు. ఈ క్రమంలో మస్క్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘ఇంత చేస్తున్నా కనీసం అతను నాకు సరైన థ్యాంక్స్ చెప్పాడా?” అంటూ అక్కడ ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ సరదాగా ప్రశ్నించారు.
మధ్య తరగతి ప్రజలు ఒక మంచి టెస్లా కారు కొనుగోలు చేసి, దానికి రుణం తీసుకుంటే, ఆ రుణంపై వడ్డీకి మేము రాయితీ (డిడక్షన్) ఇస్తున్నాం. నువ్వు(మస్క్‌ను ఉద్దేశించి..) నిజంగా అదృష్టవంతుడివి. నేను నీతో ఉన్నాను ఎలాన్’’ అని ట్రంప్ చిరునవ్వుతో అన్నారు. దీంతో అక్కడ మళ్లీ నవ్వులు విరబూశాయి.
అయితే ఈ ప్రసంగం జరిగిన కొన్ని గంటలకు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు థ్యాంక్స్ చెబుతూ.. ఆయన అమెరికాకు, ప్రపంచానికి ఎంతో చేశారంటూ కొనియాడాడు.
I would like to thank President Trump for all he has done for America and the world pic.twitter.com/KdK9VC2MLs
— Elon Musk (@elonmusk) November 19, 2025
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్‌ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్‌కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు..
ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్‌నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది సాధారణంగానే మస్క్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. టెస్లా షేర్లు పడిపోయి భారీ నష్టాలను చవిచూసింది. నాసాతో స్పేస్‌ఎక్స్ ఒప్పందాలు దాదాపుగా రద్దయ్యే స్థితికి చేరుకున్నాయి.
ఈ పరిణామాలన్నీ.. మస్క్‌ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్‌ను ఇరకాటంలో పడేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే.. హఠాత్తుగా అన్నీ మరిచిపోయి ఈ ఇద్దరూ ఇలా ఇప్పుడు కలిసి కనిపిస్తున్నారు. ఆ మధ్య కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ స్మారక సభలో ఈ ఇద్దరూ కనిపించి సందడి చేశారు. మరోవైపు..
పాశ్చాత్య దేశాలతో.. ప్రత్యేకించి వాషింగ్టన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు సౌదీ యువరాజు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయన్ను వైట్‌హౌజ్‌కు ఆహ్వానించి ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్ , క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ మస్క్ సందడి చేశారు. దీంతో అపర కుబేరుడికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే టాక్ నడుస్తోంది.


