breaking news
Whitehouse Dinner
-
ట్రంప్ అభయం.. ఓ థ్యాంక్స్ పడేస్తే పోలా!
ఎలాన్ మస్క్‌తో డొనాల్డ్ ట్రంప్ సంబంధాలు మళ్లీ మెరగవుతున్నాయా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మస్క్ వ్యాపారాల గురించి మాట్లాడిన ట్రంప్.. ఆయన వెంట తాను ఉన్నానంటూ అభయం ఇచ్చారు. దానికి మస్క్ బదులిచ్చిన తీరు నెట్టింట చర్చకు దారి తీసింది.అమెరికా-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన పన్ను రాయితీ గురించి వివరించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు లాభదాయకంగా ఉందని.. కారు కొనుగోలు చేసే వారికి ఇంత రాయితీ ఎప్పుడూ లేదని అన్నారు. ఈ క్రమంలో మస్క్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘ఇంత చేస్తున్నా కనీసం అతను నాకు సరైన థ్యాంక్స్ చెప్పాడా?” అంటూ అక్కడ ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ సరదాగా ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రజలు ఒక మంచి టెస్లా కారు కొనుగోలు చేసి, దానికి రుణం తీసుకుంటే, ఆ రుణంపై వడ్డీకి మేము రాయితీ (డిడక్షన్) ఇస్తున్నాం. నువ్వు(మస్క్‌ను ఉద్దేశించి..) నిజంగా అదృష్టవంతుడివి. నేను నీతో ఉన్నాను ఎలాన్’’ అని ట్రంప్ చిరునవ్వుతో అన్నారు. దీంతో అక్కడ మళ్లీ నవ్వులు విరబూశాయి.అయితే ఈ ప్రసంగం జరిగిన కొన్ని గంటలకు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు థ్యాంక్స్ చెబుతూ.. ఆయన అమెరికాకు, ప్రపంచానికి ఎంతో చేశారంటూ కొనియాడాడు. I would like to thank President Trump for all he has done for America and the world pic.twitter.com/KdK9VC2MLs— Elon Musk (@elonmusk) November 19, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్‌ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్‌కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్‌నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది సాధారణంగానే మస్క్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. టెస్లా షేర్లు పడిపోయి భారీ నష్టాలను చవిచూసింది. నాసాతో స్పేస్ఎక్స్ ఒప్పందాలు దాదాపుగా రద్దయ్యే స్థితికి చేరుకున్నాయి. ఈ పరిణామాలన్నీ.. మస్క్‌ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్‌ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే.. హఠాత్తుగా అన్నీ మరిచిపోయి ఈ ఇద్దరూ ఇలా ఇప్పుడు కలిసి కనిపిస్తున్నారు. ఆ మధ్య కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ స్మారక సభలో ఈ ఇద్దరూ కనిపించి సందడి చేశారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలతో.. ప్రత్యేకించి వాషింగ్టన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు సౌదీ యువరాజు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయన్ను వైట్‌హౌజ్‌కు ఆహ్వానించి ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్ , క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ మస్క్ సందడి చేశారు. దీంతో అపర కుబేరుడికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే టాక్ నడుస్తోంది. -
వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ఫౌండర నీతా అంబానీ భర్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కలిసి వైట్‌హౌస్‌లో గ్రేస్‌ఫుల్ లుక్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఇచ్చిన వైట్ హౌస్‌లో స్టేట్ డిన్నర్‌కు హాజరైన సందర్బంగా సాంప్రదాయబద్ధంగా అందమై న ఐవరీ కలర్ పట్టు చీరలో అందర్నీ ఆకట్టుకున్నారు. పూర్తిగా స్వదేశీ కళాకారులు రూపొందించిన బనారస్ పట్టు చీరను ధరించారు. దానికి సరిపోయే లేత గోధుమరంగు రంగు బ్లౌజ్, మ్యాచింగ్ మూడ వరుసల ముత్యాల హారం, పెర్ల్ నెక్లెస్, డైమండ్ పొదిగిన బ్యాంగిల్స్ , స్టడ్ చెవిపోగులతో తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటి చెప్పారు. బంగారు దారాలతో అందంగా చేతితో తయారు చేసిన సహజమైన పట్టు చీరను ఎంచుకోవడం విశేషం. (గిఫ్టెడ్ ఆర్టిస్ట్ నీతా అంబానీ అద్భుతమైన ఫోటోలు) ఎన్ఎంఏసీసీ అందించిన సమాచారం ప్రకారం రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ ఆర్టిసన్-ఓన్లీ స్టోర్ ఫార్మాట్, స్వదేశ్, ముంబైలోని జియో మార్ట్‌లోని వారి ఇటీవల ప్రారంభించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఈ చీరను తయారు చేశారు. అంతేకాదు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సహ-హోస్ట్ చేసిన స్టేట్ లంచ్‌లో గుజరాత్‌లోని పటాన్‌కు చెందిన ఎత్నిక్ పటోలా చీరను ధరించడం విశేషంగా నిలిచింది. ఈ గులాబీ రంగు పటోలా చీర పూర్తి చేయడానికి 6 నెలల పట్టిందట. భారతదేశ సంస్కృతి , సంప్రదాయం పట్ల ప్రేమ, ఫ్యాషన్ సెన్స్‌ను ఎపుడూ నిరూపించు కుంటూఉంటారు. స్పెషల్ కలెక్షన్స్‌కి ఆమె వార్డ్రోబ్ చాలా పాపులర్. దీనికి తోడు ఇటీ నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ వేదికను కల్పించారు. నీతా అంబానీ వివిధ రంగాలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2023లో ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ప్రతిష్టాత్మక అవార్డు గెల్చుకున్నారు. (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?) Mrs. Nita Ambani’s sartorial choice – reflecting her vision of promoting Indian artisans – also found a place of pride at the State lunch co-hosted by U.S. Vice President Kamala Harris where she wore an ethnic Patola saree from Patan, Gujarat. pic.twitter.com/HXZWc19pfg — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) June 24, 2023 -
నవ్వులు పూయించిన ఒబామా
♦ వైట్‌హౌస్‌లో చిట్టచివరి డిన్నర్ ఇచ్చిన ఒబామా ♦ అందరిపై జోకులు వేస్తూ నవ్వించిన అమెరికా నేత ♦ ఒబామా ఔట్ అంటూ ప్రసంగానికి ముగింపు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చిట్టచివరి వైట్‌హౌస్ డిన్నర్‌ను శనివారం ఇచ్చారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రముఖ జర్నలిస్టులు హాజరైన ఈ కార్యక్రమంలో తనపై తానే జోకులు వేసుకున్నారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లపై సెటైర్లు వేశారు.. మీడియా ప్రముఖులు, తన తర్వాత అధ్యక్ష పీఠమెక్కుతారని భావిస్తున్న వారి పైనా జోకులు పేల్చారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన ‘వైట్‌హౌస్ కరస్పాం డెంట్స్ డిన్నర్’కు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఒబామా మాట్లాడుతూ, ‘నా ఎనిమిదో, ఆఖరి ప్రసంగం ఇవ్వడం చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇది చాలా గౌరవం. ఎనిమిదేళ్ల క్రితం యువకుడిని. ఎంతో కసితో ఉండేవాడిని. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయానో’ అని అన్నారు. ‘‘వచ్చే ఏడాది ఈ స్థానంలో మరో అధ్యక్షులు ఉంటారు. ఆమె ఎవరో గెస్ చేయండి’’ అంటూ పరోక్షంగా హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిల్లరీ ఆంటీ అంటూ ఆమెను ఆటపట్టించారు. అయితే ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్, జాన్ కాషిచ్ హాజరుకాలేదు. అయినా ట్రంప్‌ను టార్గెట్ చేసుకుని ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మిస్ స్వీడన్, మిస్ అర్జెంటీనా, మిస్ అజర్బైజాన్ ట్రంప్‌కు విదేశీ విధానాలకు సంబంధించి సరైన అనుభవం లేదని భావించారని, అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్లు వారు తెలిపారని ఒబామా చెప్పారు. ఆద్యంతం నవ్వులు పూయించిన ఒబామా చివరగా మైక్‌ను డ్రాప్ చేసి ‘ఒబామా ఔట్’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఇండో అమెరికన్ జర్నలిస్ట్‌కు అవార్డ్ ఈ కార్యక్రమంలో ఒబామా, మిషెల్ దంపతులు ప్రముఖ ఇండో అమెరికన్ జర్నలిస్ట్ నీలా బెనర్జీని ఎడ్గర్ ఏ పో అవార్డ్‌తో సత్కరించారు. ఆమెతో పాటు ‘ఇన్సైడ్ క్లైమేట్ న్యూస్’ నుంచి మరో ముగ్గురికి వారు ఈ పురస్కారాన్ని బహూకరించారు. జాతీయ స్థాయిలో అందించిన పాత్రికేయ సేవలకు ‘వైట్ హౌజ్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్’ అ అవార్డ్‌ను అందిస్తుంది.


