ఇకపై దాడులొద్దు | Trump condemns Israel attack on Beirut | Sakshi
Sakshi News home page

ఇకపై దాడులొద్దు

Jun 15 2026 2:19 AM | Updated on Jun 15 2026 2:19 AM

Trump condemns Israel attack on Beirut

శాంతి యత్నాలకు విఘాతం కలిగించొద్దు 

ఇజ్రాయెల్, ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక  

బీరూట్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు

జెరూసలేం: ఇకపై ఎలాంటి దాడులు చేసుకున్నా సహించేది లేదని ఇజ్రాయెల్, ఇరాన్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌ శివార్లలో హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన తాజా దాడులపై ఆయన ఆదివారం స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో దాడులు, ప్రతిదాడులకు దిగితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని, శాంతి యత్నాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేశారు.

అందుకే సంయమనం పాటించాలని ఇజ్రాయెల్, ఇరాన్‌లకు తేల్చిచెప్పారు. ఇలాంటి ఉద్రిక్తతల వల్ల శాంతి ఒప్పందంపై సంతకాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. బీరూట్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడిలో పలువురు మరణించారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా మూడు మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను వెలికితీసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బీరూట్‌పై ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ప్రతీకార దాడులు తప్పవని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి సాధనే లక్ష్యంగా ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చామని పేర్కొన్నారు. ఇకపై ఎవరూ ఎలాంటి దాడులు చేసుకోవద్దని స్పష్టంచేశారు.  

ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తి!  
శాంతి ఒప్పందంపై ఆదివారం సంతకాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒప్పందంలోని అంశాలు ఆయనకు తీవ్ర నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా బీరూట్‌పై దాడికి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ఇజ్రాయెల్‌ హెజ్‌బొల్లా మిలిటెంట్లు దాడికి దిగారని, అందుకే ప్రతిస్పందనగానే తాము బీరూట్‌పై దాడులు చేసినట్లు నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ దుశ్చర్యపై ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఖలిబాఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో శాంతిని స్థాపించాలన్న సంకల్పం అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలకు లేదన్నారు. హెజ్‌బొల్లాకు ఇరాన్‌ మద్దతిస్తోంది. ఆయుధాలు, ఆర్థిక సాయం అందజేస్తోంది. అమెరికా–ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేయాలన్న అంశాన్ని కూడా చేర్చాలని ఇరాన్‌ పట్టుబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement