విదేశీ కార్మికులు అవసరం తమ దేశానికి ఉందని ట్రంప్ ప్రకటన చేసి 24 గంటలైనా గడవక ముందే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ట్రంప్ హెచ్-1బీ వీసా కొత్త విధానం ఉద్దేశ్యం బయటపెట్టారు. అమెరికా పౌరులను ఉన్నతమైన ఉద్యోగాలలో నియమించేందుకు విదేశాల నుంచి వలస కార్మికులు తాత్కాలికంగా అమెరికా వచ్చి ఆ దేశ పౌరులకు శిక్షణ ఇచ్చి తిరిగి తమ దేశాలకు వెళ్లాలన్నారు. తద్వారా అమెరికన్స్ ఉన్నతమైన ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం ఉద్దేశ్యం ఇదే అయిండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో తాత్కాలికంగా స్థిరపడిన విదేశీయులు, చదువుకోసం అమెరికాకెళ్లిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ సమయంలో తమను దేశం వదిలి వెళ్లమంటారో అని కంగారుపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల ఆ దేశం ఆమోందిచిన హెచ్-1బీ వీసా బిల్లు దానికి మరింత బలాన్ని చేకూర్చింది. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్షడాలర్లకు పెంచి ఆ దేశంలోకి వచ్చేవారి అవకాశాలను మరింత కఠినతరం చేశారు. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్యూలో ట్రంప్ హెచ్-1బీ పాలసీ వ్యూహం బహిర్గతం చేశారు.
అమెరికన్స్ గత 20-30 ఏళ్లుగా తయారీరంగంలోని ఉన్నతమైన ఉద్యోగాలలో లేరు, ఓడలు, సెమీకండక్టర్స్ నిర్మించలేదు. ఆ రంగాలలో వారికి తగినంత ప్రతిభ లేదు. కనుక విదేశాలనుంచి నైపుణ్యత కలిగిన కార్మికులు అమెరికాకు వచ్చి రెండు, ఐదు, ఏడు సంవత్సారాలపాటు అమెరికాలో ఉండి ఆ దేశ కార్మికులకు శిక్షణ ఇచ్చి వెళ్లాలని.. ట్రంప్ నూతన పాలసీ విధానం ఉద్దేశ్యం ఇదే అయి ఉండవచ్చని బీసెంట్ అన్నారు.
అలా శిక్షణ పొందిన అనంతరం తిరిగి ఆ ఉద్యోగాలను టేకాఫ్ చేసుకుంటారని అన్నారు. వలస కార్మికులు ఆ దేశంలో ఉండడంతో ఒక్క అమెరికన్ ఉద్యోగం పొందలేకపోతున్నారని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల క్షేమం కొరకే పనిచేస్తుందని లక్ష డాలర్లు లోపల ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్నులో రెండువేల డాలర్లు రాయితీ ఇచ్చే అంశం చర్చిస్తున్నామన్నారు. కాగా నిన్న ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ అమెరికన్లకు మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో తగినంత నైపుణ్యత లేదని ఆ రంగాలలో విదేశీయులను నియమించుకునే అవసరముందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


