సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం
భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు.
వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఈ–మెయిల్ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.
ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తంచేశారు.
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


