అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్‌ లీక్‌? | US Strikes On Iranian Nuclear Sites Cause Radiation Leak, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్‌ లీక్‌?

Jun 22 2025 12:06 PM | Updated on Jun 22 2025 1:57 PM

Strikes on Iranian nuclear sites cause radiation leak

టెహ్రాన్‌: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణుకేంద్రాలపై భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా జోక్యంతో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై వైమానికదాడులు జరిగిన దరిమిలా రేడియేషన్ ముప్పుపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఈ దాడుల అనంతరం ఈ అణుకేంద్రాల సమీపంలోని వారికి ఎటువంటి హాని జరగలేదని  ఇరాన్ అణు నియంత్రణ అధికారులు తెలిపారు. అమెరికా దాడి చేసిన అణు కేంద్రాలలో రేడియేషన్ కలిగించే పదార్థాలు లేవని ఇరానియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ అధికారి ఒకరు  మీడియాకు తెలిపారు. దాడుల అనంతరం కాలుష్య కారక సంకేతాలు నమోదు కాలేదని ఇరాన్  జాతీయ అణు భద్రతా వ్యవస్థ కేంద్రం తెలిపింది. ఈ దాడుల నేపధ్యంలో రేడియేషన్ స్థాయిలలో పెరుగుదల కనిపించలేదని  యూఎన్‌ అణు వాచ్‌డాగ్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ధృవీకరించింది.

యూఎస్ దాడులకు ముందు కూడా ఇరానియన్ సైట్‌లపై ఇజ్రాయెల్ దాడులకు దిగినప్పుడు కూడా రేడియేషన్ భయాలు రేకెత్తాయి. అణు సౌకర్యాలపై  దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏనాడో హెచ్చరించింది. కాగా ఈ అణుకేంద్రాలపై దాడుల తరువాత సమీప ప్రాంత ప్రజలను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు.  దేశంలోని యురేనియం నిల్వలను అణు కేంద్రాల నుండి బదిలీ చేశారని, రేడియేషన్‌కు కారణమయ్యే పదార్థాలు అక్కడ లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ డిప్యూటీ  హెడ్‌ హసన్ అబేది తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement