బిల్లుకు సెనేట్ ఆమోదం
నేడు ప్రతినిధుల సభలో ఓటింగ్
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 రోజులపాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన షట్‌డౌన్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. షట్‌డౌన్‌ను ముగించి, ప్రభుత్వ సేవలను మళ్లీ ప్రారంభించడానికి వీలుగా సంబంధిత బిల్లును సోమవారం సెనేట్‌లో ఆమోదించారు. బిల్లుకు మద్దతివ్వడాన్ని విపక్ష డెమొక్రటిక్ పార్టీలో కొందరు సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. అధికార రిపబ్లికన్ పార్టీతో అవగాహన కుదరడమే ఇందుకు కారణం. సెనేట్‌లో బిల్లుకు అనుకూలంగా 60 ఓట్లు, వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. ఇకపై కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుండడంతో అతిత్వరలో షట్‌డౌన్ ముగిసిపోనున్నట్లు తెలుస్తోంది.
బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సేవలను చాలా వేగంగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, షట్‌డౌన్ ముగింపు బిల్లును బుధవారం మధ్యాహ్నమే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ సభలో కూడా ఆమోదం పొందితే బుధవారమే షట్‌డౌన్‌కు తెరపడే అవకాశం ఉంది. గత నెలలో వార్షిక నిధుల బిల్లుకు సెనేట్ ఆమోదం తెలపకపోవడంతో దేశమంతటా షట్‌డౌన్ మొదలైన సంగతి తెలిసిందే.
దీంతో ప్రభుత్వ సేవలు చాలావరకు నిలిచిపోయాయి. అత్యంత ముఖ్యమైన సేవలు మాత్రమే కొనసాగాయి. వేతనాలు హఠాత్తుగా ఆగిపోవడంతో ఉద్యోగుల ఇక్కట్లపాలయ్యారు. నిధులు లేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. పలు కీలక రంగాలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు కూడా ఆగిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


