ముగ్గురు చిన్నారులుసహా 25 మంది దుర్మరణం
కీవ్: ఉక్రెయిన్‌పై నెలలతరబడి దురాక్రమణ రంకెలేస్తున్న రష్యా బుధవారం ముప్పేటదాడి పాతిక మంది ప్రాణాలను బలితీసుకుంది. పశ్చిమాన ఉన్న టెర్నోపిల్ నగరంపై బుధవారం రష్యా జరిపిన దాడుల్లో ముగ్గురు చిన్నారులుసహా 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహర్ కిలిమెంకో ధ్రువీకరించారు.
రష్యా ఆక్రమణలను అడ్డుకునేందుకు, దౌత్య మద్దతు కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తుర్కియేకు వచ్చిన సమయంలోనే రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సిటీలోని రెండు బహుళ అంతస్తుల భవనలపై రష్యా ఎక్స్–101 క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. దీంతో భవనాలు ధ్వంసమై 73 మంది తీవ్రంగా గాయపడ్డారని కిలిమెంకో వెల్లడించారు. 15 మంది చిన్నారులు రక్తమోడుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి.
48 క్షిపణులు, డ్రోన్లుసహా మొత్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రిదాకా 24 గంటల్లో ఏకంగా 476 సార్లు రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. ఇటీవలికాలంలో రష్యా ఈస్థాయిలో దాడులుచేయడం ఒకేరోజు పాతికమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. పశ్చిమదేశాలు అందించిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధవిమానాలు, మిరాజ–2000 జెట్‌ల సాయంతో 10 క్రూయిజ్ క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వెల్లడించింది. మరోవైపు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో చర్చల ద్వారా రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని జెలెన్‌స్కీ చెప్పారు.


