ఉక్రెయిన్‌పైకి క్షిపణులు, డ్రోన్ల దండు  | Russia Hits Ukraine With Missiles and Drones, Killing at Least 9 peoples | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పైకి క్షిపణులు, డ్రోన్ల దండు 

Jul 31 2026 4:43 AM | Updated on Jul 31 2026 4:43 AM

Russia Hits Ukraine With Missiles and Drones, Killing at Least 9 peoples

9 మంది మృతి, 50 మందికి గాయాలు

కీవ్‌: బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో రష్యా మరోసారి ఉక్రెయిన్‌పైకి దండెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాజధాని కీవ్‌ నుంచి సుదూరంగా ఉన్న లీవ్‌ దాకా 10 ప్రాంతాలపై దాడులు జరిపింది. రష్యా దాడులతో రాజధాని కీవ్‌ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో నీప్రోపెట్రోవిస్క్ లో ఆరుగురు, కీవ్, పోల్టావాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 8 మంది చనిపోయారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. 

జెలెన్‌స్కీ సొంతూరు క్రీవ్యీ రిహ్‌లోని నీప్రోపెట్రోవిస్క్ లో ఓ ఇంటిపై ఇస్కందర్‌ బాలిస్టిక్‌ క్షిపణి నేరుగాపడటంతో అందులో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది గాయాలతో బయటపడ్డారు. లీవ్‌ నగరంపై జరిగిన క్షిపణి దాడుల్లో రెండు అపార్టుమెంట్లు ధ్వంసం కాగా 34 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఖెర్సన్‌ నగరంలోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా శక్తివంతమైన మూడు గ్లైడ్‌ బాంబులను ప్రయోగించిందని, ఒకరు చనిపోయారన్నారు. రష్యా 70కి పైగా వివిధ రకాల క్షిపణులు, 280 డ్రోన్లను ప్రయోగించిందని అధికారులు చెప్పారు. 

వీటిలో 260 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామన్నారు. కాగా, ఉక్రెయిన్‌ సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు జరిపినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. నల్లసముద్ర తీరంలోని ఒడెసాలో ఆయుధాలు, మిలటరీ సామగ్రితో ఉన్న మూడు సరుకు నౌకలపై దాడులు జరిపినట్లు వెల్లడించింది. కాగా, రష్యా ప్రయోగించిన కేహెచ్‌–101 బాలిస్టిక్‌ క్షిపణి ఒకటి దారి తప్పి లీవ్‌కు సమీపంలో పోలెండ్‌ భూభాగంలో పడినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. ఓ వ్యవసాయ క్షేత్రంలో పడటంతో భారీ గొయ్యి ఏర్పడిందని తెలిపింది. దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలెండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ చెప్పారు.  

వైల్డ్‌బెర్రీస్‌పై ఆగని దాడులు.. 
రష్యా ఆరీ్మకి సరుకులు రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆన్‌లైన్‌ రిటెయిలర్‌ వైల్డ్‌బెర్రీస్‌ ఔట్‌లెట్లపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా, రష్యాలోని పెంజా, సరపుల్, పెర్మ్‌ల్లోని మూడు వైల్డ్‌బెర్రీస్‌ గోదాములపై దాడులు చేపట్టింది. దీంతో, అవి మంటల్లో చిక్కుకున్నాయని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలపైకి బుధవారం రాత్రి ఉక్రెయిన్‌ ప్రయోగించిన 258 డ్రోన్లను కూల్చినట్లు రష్యా ఆర్మీ తెలిపింది. అదేవిధంగా, రష్యా షాడో ఫ్లీట్‌కు చెందిన మరో నాలుగు చమురు నౌకలపై డ్రోన్‌ దాడులు జరిపామని, దీంతో జూలై 6వ తేదీ నుంచి తాము ఇప్పటి వరకు దాడి చేసిన నౌకల సంఖ్య 205కు చేరుకుందని ఉక్రెయిన్‌ డ్రోన్‌ దళం తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement