అమెరికా చేతికి గ్రీన్‌లాండ్‌?..వెలుగులోకి షాకింగ్‌ ప్లాన్! | Randy Fine Congressman Fine Introduced Greenland Annexation Bill | Sakshi
Sakshi News home page

అమెరికా చేతికి గ్రీన్‌లాండ్‌?..వెలుగులోకి షాకింగ్‌ ప్లాన్!

Jan 13 2026 3:51 PM | Updated on Jan 13 2026 4:22 PM

Randy Fine Congressman Fine Introduced Greenland Annexation Bill

వాషింగ్టన్‌:గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేస్తోంది. ఆ దీవిని అమెరికాలో కలపాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు రాండి ఫైన్ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‌లాండ్‌ అనక్సీయేషన్‌ అండ్‌ స్టేట్‌హుడ్‌ యాక్ట్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం, ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించడం వంటి అంశాలు పొందుపరచబడ్డాయి.

ఈ మేరకు రాండి ఫైన్ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘బిగ్ న్యూస్. చట్టసభలో  గ్రీన్‌లాండ్‌ అనక్సీయేషన్‌ అండ్‌ స్టేట్‌హుడ్‌ యాక్ట్‌ పేరుతో బిల్లును ప్రవేశపెట్టాను. ఈ బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపాలి. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపాలి’ అని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలుపుకోవడం ద్వారా జాతీయ భద్రత బలోపేతం అవుతుంది. అదే సమయంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికా రాష్ట్రంగా మార్చడం ద్వారా ఆర్కిటిక్‌ ప్రాంతంలో చైనా, రష్యా ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి గ్రీన్‌లాండ్ అమెరికా భద్రతకు అత్యంత అవసరమని ఆయన అన్నారు.

ప్రస్తుతం గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. దీనికి స్వంత పార్లమెంట్ ఉన్నప్పటికీ, విదేశాంగం, రక్షణ వ్యవహారాలు డెన్మార్క్ ఆధీనంలోనే ఉంటాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ట్రంప్ డెన్మార్క్‌తో చర్చలు జరిపి గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం లేదా అమెరికాలో కలుపుకోవడం కోసం అధికారం పొందుతారు. గ్రీన్‌లాండ్ భౌగోళికంగా చాలా ముఖ్యమైనది. ఇది ఆర్కిటిక్‌ సముద్ర మార్గాలను నియంత్రించగలదు, అలాగే సైనిక రవాణా, వాణిజ్యం, ఇంధన మార్గాలు అన్నీ ఇక్కడి ద్వారా ప్రభావితం అవుతాయి.

2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వ్యక్తం చేశారు. ఆ సమయంలో డెన్మార్క్ ప్రభుత్వం దీన్ని ఖండించింది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉంది. ఇది ఆమోదం పొందితేనే గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement