17న ట్రంప్, మోదీ భేటీ | PM Modi to meet Trump on sidelines of G7 Summit in France on June 17 | Sakshi
Sakshi News home page

17న ట్రంప్, మోదీ భేటీ

Jun 14 2026 4:13 AM | Updated on Jun 14 2026 4:13 AM

PM Modi to meet Trump on sidelines of G7 Summit in France on June 17

వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం  

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్‌హౌస్‌ శనివారం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల పట్ల వారు అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కాబోతుండడం ఇదే మొదటిసారి. అప్పట్లో మోదీ వాషింగ్టన్‌లో పర్యటించారు. తర్వాత వారు పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

టారిఫ్‌ల యుద్ధంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్‌ పదేపదే ప్రకటించగా, భారత్‌ కొట్టిపారేసింది. అలాగే ఇటీవల ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా చర్యను భారత్‌ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఫ్రాన్స్‌ చేరుకున్న ప్రధాని మోదీ 
జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత ప్రధాని మోదీ శనివారం ఫ్రాన్స్‌ చేరుకున్నారు. నైస్‌ నగర ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న మోదీని ఫ్రాన్స్‌ విద్యా మంత్రి ఎడోగార్డ్‌ గిఫ్రే, పరిశోధనా మంత్రి ఫిలిఫే బాప్టిస్టే, భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి థియెరీ మాథ్యూ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్‌తోపాటు ఎవియాన్, పారిస్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. మేక్రాన్‌తో కలిసి భారత్‌ ఇన్నోవేట్స్‌ను ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇరుదేశాలతోపాటు ఇతర దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకుర సంస్థలు, పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి మోదీ తర్వాత స్లోవేకియాకు వెళ్లనున్నారు. 14–15 తేదీల్లో అక్కడ బ్రాటిస్లావాలో అధ్యక్షుడు పీటర్‌ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్‌ ఫికో, వ్యాపారరంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తిరిగి ఫ్రాన్స్‌ చేరుకుని 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో గ్లోబల్‌ సౌత్‌ గళం వినిపిస్తానని మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement