నీటి మళ్లింపు.. పాక్‌పై యుద్ధ ప్రకటనే  | Pakistan suspends trade and closes borders with India | Sakshi
Sakshi News home page

నీటి మళ్లింపు.. పాక్‌పై యుద్ధ ప్రకటనే 

Apr 25 2025 4:44 AM | Updated on Apr 25 2025 4:44 AM

Pakistan suspends trade and closes borders with India

భారత్‌పై దాయాది ఆక్రోశం.. ప్రతీకార చర్యలు

సిమ్లా ఒప్పందం సహా ద్వైపాక్షిక ఒప్పందాల నిలిపివేత 

భారత విమానాలకు పాక్‌ గగనతలం బంద్‌   

వాఘా సరిహద్దు తక్షణమే మూసివేత  

భారత పౌరులకు ఇచ్చిన వీసాలన్నీ రద్దు  

సింధూ జలాలపై హక్కులు కాపాడుకుంటామని వెల్లడి  

ఇస్లామాబాద్‌: సింధూ నది జలాల ఒప్పందాన్ని లెక్కచేయకుండా నీటి మళ్లింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా అది తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా పాకిస్తాన్‌ సైతం భారత్‌పై ఆంక్షలు ప్రకటించింది. భారతదేశ విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. 

ఇండియాతో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలో గురువారం నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ(ఎన్‌ఎస్సీ) సమావేశం జరిగింది.

 పలువురు మంత్రులతోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై చర్చించారు. భారత్‌పైనా అదే తరహా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్‌ఎస్సీ భేటీ అనంతరం పాక్‌ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. కేవలం సిమ్లా ఒప్పందమే కాకుండా మిగతా ఒప్పందాలనూ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.  

పాక్‌ ప్రభుత్వ నిర్ణయాలు  
→ ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు సిమ్లా ఒప్పందం సైతం నిలిపివేత.  
→ వాఘా బోర్డర్‌ పోస్టు తక్షణమే మూసివేత. రాకపోకలు పూర్తిగా రద్దు.  
→ ఈ సరిహద్దు గుండా బయటకు వెళ్లినవారు 30లోగా తిరిగిరావాలి.  
→ సార్క్‌ వీసా మినహాయింపు పథకం(ఎస్‌వీఈఎస్‌) కింద భారతీయులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలు వెంటనే రద్దు. సిక్కు యాత్రికులకు మాత్రం మినహాయింపు. 
→ ఎస్‌వీఈఎస్‌ పథకం కింద పాకిస్తాన్‌లో ఉన్న భారతీయులు 48 గంటల్లోకి బయటకు వెళ్లిపోవాలి.  
→ పాక్‌లో ఉన్న భారతీయ త్రివిధ దళాల సభ్యులు ఏప్రిల్‌ 30 లోగా వెనక్కి వెళ్లిపోవాలి. భారత హైకమిషన్‌లోని ఈ పోస్టులు రద్దు.   
→ భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న భారత సహాయక సిబ్బంది సైతం స్వదేశానికి వెళ్లిపోవాలి. 
→ ఇండియన్‌ హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, సిబ్బంది సంఖ్య 30కి పరిమితం. ఇది ఈ నెల 30వ తేదీ నుంచి అమల్లోకి.  
→ పాక్‌ గగనతలంపై ప్రయాణించేందుకు భారత విమానాలు అనుమతి లేదు. ఈ నిర్ణయం ఇది తక్షణమే అమలు.  
→ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణం. 24 కోట్ల మంది పాక్‌ పౌరులకు ఈ జలాలు జీవనాధారం. 
→ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో, ఎక్కడున్నా అంతం చేయాల్సిందే. శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ పాక్‌ సార్వ¿ౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన రీతిలో బదులిస్తాం.  
→ రాజకీయ ఎజెండా కోసం పాక్‌పై నిందలు వేయడం భారత్‌ మానుకోవాలి. ఇలాంటి నిందలు శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు.   
 

Advertisement
 
Advertisement
Advertisement