పాక్‌ ఫేక్‌ ప్రచార సారథి... ఓ ఉగ్రవాది కొడుకు | Pakistan military spokesman Ahmed Sharif Chaudhry has Terrorist son | Sakshi
Sakshi News home page

పాక్‌ ఫేక్‌ ప్రచార సారథి... ఓ ఉగ్రవాది కొడుకు

May 11 2025 3:36 AM | Updated on May 11 2025 3:36 AM

Pakistan military spokesman Ahmed Sharif Chaudhry has Terrorist son

లెఫ్టినెంట్‌ జనరల్‌ షరీఫ్‌ చీకటి వారసత్వం 

ఆర్మీ చీఫ్‌ మునీర్‌ స్వయానా ఓ జిహాదీ 

పాక్‌ ‘ఉగ్ర’బంధానికి నిలువెత్తు నిదర్శనాలు

లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధురి. భారత్‌పై పాకిస్తాన్‌ సాగిస్తున్న గోబెల్స్‌ ప్రచారానికి సారథి. పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌. పహల్గాం ఉగ్ర దాడి నుంచీ భారత్‌పై పథకం ప్రచారం దాయాది తలపెట్టిన తప్పుడు ప్రచారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చౌధురే. అతను ఓ ఉగ్రవాది కుమారుడు కావడం విశేషం. ఉగ్రవాదంతో విడదీయలేని రీతిలో పెనవేసుకు పోయిన పాకిస్తాన్‌ బంధానికి నిలువెత్తు నిదర్శనం. 

దారితప్పిన సైంటిస్టు 
చౌధురి తండ్రి సుల్తాన్‌ బషీరుద్దీన్‌ మెహమూద్‌. అవడానికి అణు శాస్త్రవేత్త. పాక్‌ అణ్వాయుధ పిత అబ్దుల్‌ ఖదీర్‌ఖాన్‌తో కలిసి అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించాడు. యురేనియం శుద్ధి తదితరాల్లో చురుగ్గా వ్యవహరించాడు. అందుకోసం గ్యాస్‌ సెంట్రిఫ్యూజ్‌ టెక్నాలజీని నెదర్లాండ్స్‌ నుంచి తస్కరించాడు. కానీ నిజానికి అతనో కరడుగట్టిన మతోన్మాది. అంతకుమించి పేరుమోసిన ఉగ్రవాది. 

నరనరానా భారత విద్వేషాన్ని నింపుకున్న వ్యక్తి. ఐరాస భద్రతా మండలి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. పాక్‌ అణ్వాయుధ పరిజ్ఞానాన్ని దాదాపుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా చేతిలో పెట్టిన ధూర్తుడు. అప్పటి అల్‌కాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు. బషీర్‌ చేసిన ఈ నిర్వాకం అప్పట్లో పాశ్చాత్య దేశాలకు పెద్ద సంకటంగా మారింది. 

అలాంటి వ్యక్తి కొడుకైన చౌధురి భారత్‌తో సైనిక సంఘర్షణ గురించి పాక్‌ తరఫున నాలుగు రోజులుగా అధికారికంగా బయటి ప్రపంచానికి చెబుతున్నాడు! ఓ అంతర్జాతీయ ఉగ్రవాది కొడుకే పాక్‌కు అంతర్జాతీయ గొంతుకగా మారాడు. ‘మాది ఉగ్రవాద బాధిత దేశం’అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేగాక అధికారికంగానూ, ఆన్‌లైన్‌లోనూ భారత్‌పై ఇబ్బడిముబ్బడిగా ఫేక్‌ న్యూస్‌ ప్రచారం వ్యాప్తి చేస్తున్నాడు. చౌధురి తీరును పాక్‌ ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. భారత సైన్యం చేతిలో పాక్‌ రోజూ చావుదెబ్బలు తింటున్నా అతను మాత్రం ఆ వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి లేనిపోని గొప్పలకు పోతున్నాడంటూ మండిపడుతున్నారు. 

డీఎన్‌ఏలోనే ఉగ్రవాదం 
లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌధురి తండ్రి బషీర్‌ను 2001లో ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. బిన్‌లాడెన్‌ ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దన్నుగా నిలుస్తున్నాడని స్పష్టంగా పేర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడితో మరో దారిలేక అదే ఏడాది పాక్‌ ఐఎస్‌ఐ అతన్ని అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ బషీర్‌ను స్వయంగా విచారించింది. బిన్‌లాడెన్‌ను కలిసినట్టు దర్యాప్తులో అతను అంగీకరించాడు. 

2009లో ప్రభుత్వ విధుల నుంచి తప్పించింది. ముసుగు తొలగిపోవడంతో బషీర్‌ మరింత రెచ్చిపోయాడు. ఉమ్మా తమీరీ నౌ (యూటీఎన్‌) అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఓ ఉగ్ర సంస్థను స్థాపించాడు. రసాయన, జీవాయుధాలతో పాటు ఏకంగా అణ్వాయుధాలను గురించి లాడెన్‌కు, తాలిబన్లకు కావాల్సిన సమాచారం అందించడం మొదలుపెట్టాడు. తాలిబన్ల నాటి చీఫ్‌ ముల్లా ఒమర్‌తో తరచూ భేటీ అయ్యేవాడు. 

మునీర్‌.. ఓ మతోన్మాది 
పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీం మునీర్‌ది కూడా పూర్తిగా జిహాదీ నేపథ్యమే. ఆయన తండ్రి సయ్యర్‌ సర్వర్‌ మునీర్‌ ఓ మదర్సాలో ఇస్లాం బోధకుడు. ఆ ఛాయల్లో పెరిగిన మునీర్‌ కూడా కరడుగట్టిన మతోన్మాదిగా మారాడు. నరనరానా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. 2019లో జమ్మూలోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి ఉగ్ర దాడికి మునీరే వ్యూహకర్త. అప్పట్లో పాక్‌ నిఘా విభాగం ఐఎస్‌ఐ చీఫ్‌గా ఆ దాడిని దగ్గరుండి పర్యవేక్షించాడు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement